6 నెలల్లో 30 కోట్ల మందికి టీకా

COVID-19: India to inoculate 30 cr people in 6-7 months - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రానున్న ఆరేడు నెలల్లో 30 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. కోవిడ్‌–19పై శనివారం  మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. కోటికి పైగా కేసులు మన దేశంలో నమోదైనప్పటికీ, రికవరీ రేటు విషయంలో భారత్‌ చాలా ముందుందని అన్నారు. పండుగల సీజన్‌లో కూడా దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఓ పరిమితిని మించి పెరగలేదన్నారు. పండుగ సమయాల్లో తీసుకు న్న జాగ్రత్తలనే వ్యాక్సినేషన్‌ సమయంలో కూడా పాటించాలని సూచించారు.

మోదీ కృషి అమోఘం: కరోనా సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న చర్యలే దేశంలో కరోనాను నియంత్రించేందుకు, అవగాహన కల్పించేందుకు తోడ్పడ్డాయని హర్షవర్ధన్‌ వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్ని ఆయన సమీక్షించారని అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సైతం మోదీ అదే చొరవను ప్రదర్శించారని తెలిపారు. 

అంత తీవ్రత ఉండక పోవచ్చు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తిరిగి భారీ స్థాయిలో పెరగకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ చెప్పారు. సెప్టెంబర్‌ మధ్య కాలంలో రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆ స్థాయిలో తిరిగి కేసులు నమోదయ్యే అవకాశం ఉండబోదని ఆయన పేర్కొన్నారు.  కేసుల సంఖ్య నవంబర్‌లో నమోదైన తీరులోనే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.  

25 వేల కొత్త కేసులు: దేశంలో 24 గంటల్లో 25,152   కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో  347 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,45,136కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95.50 లక్షలకు చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,13,831గా ఉంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top