అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ | Corporation Commissioner Chitra transferred | Sakshi
Sakshi News home page

అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ

Jun 1 2026 8:39 AM | Updated on Jun 1 2026 7:34 PM

Corporation Commissioner Chitra transferred

సాక్షి, చెన్నై: మదురై నగర పాలక సంస్థ (కార్పొరేషన్‌) చరిత్రలో అత్యంత నిజాయితీ కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకున్న కమిషనర్‌ చిత్రా బదిలీ అయ్యారు. కార్పొరేషన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్‌) కుంభకోణాన్ని వెలికితీసి, అసిస్టెంట్‌ కమిషనర్‌ నుండి బిల్‌ కలెక్టర్ల వరకు ఏకంగా 28 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసి సంచలనం  సృష్టించిన ఆమెను ప్రభుత్వం బదిలీ చేయడంతో మదురై వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చెన్నై కార్పొరేషన్‌ నార్త్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. 

అవినీతిపై ’చిత్రా’స్త్రం.. 
మదురై కార్పొరేషన్‌కు 71వ కమిషనర్‌గా, అలాగే తొలి మహిళా కమిషనర్‌గా చిత్రా 2025 ఫిబ్రవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె వచ్చే నాటికి కార్పొరేషన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతకుముందు 2021 నుండి 2025 వరకు కేవలం నాలుగేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారారంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన చిత్రా, కేవలం ఏడాదిన్నర కాలంలోనే కార్పొరేషన్‌ రూపురేఖలను మార్చేశారు. కేవలం ఆరోపణలకే పరిమితమైన ఆస్తి పన్ను అవినీతిపై గట్టి నిఘా పెట్టి, నిరూపించడమే కాకుండా పోలీసు విచారణకు ఆదేశించారు.

 ఈ విప్లవాత్మక చర్యే చివరకు మదురై మేయర్, ఐదుగురు జోనల్‌ చైర్మన్ల పదవులు ఊడిపోవడానికి ముఖ్య కారణమైంది. కార్పొరేషన్‌ ఖజానాకు భారీగా ఆదాయం కమిషనర్‌ చిత్రా తనదైన శైలిలో సంస్కరణలు చేపట్టారు. మదురై ప్రగతికి బాట వేయడమే కాకుండా పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచే కార్యక్రమాలు విస్తృతం చేసిన చిత్రాను  కొత్త ప్రభుత్వం  ఐఏఎస్‌ అధికారుల బదిలీల పర్వంలో భాగంగా మదురై నుండి చెన్నైకు స్థాన చలనం కల్పించారు. అయితే, మదురై వాసులు ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement