బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై యోగి హర్షం

CM Yogi Adityanath And Other BJP Leaders Welcomes Babri Case Verdict - Sakshi

న్యూఢిల్లీ/లక్నో: బాబ్రీ మసీదు కేసు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం వెలువరించి తీర్పు పట్ల ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. చివరకు న్యాయమే గెలించిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ దురుద్దేశంతోనే సాధువులు, బీజేపీ నాయకుల పరువు మసకబార్చేలా కేసులు బనాయించారని ఆరోపించారు. విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో పాటు వివిధ సామాజిక సంస్థలను ఈ కేసులో ఇరికించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ చేసిన పని కారణంగా వీళ్లంతా సుదీర్ఘకాలంగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా యోగి డిమాండ్‌ చేశారు.

కాగా 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ, మురళి మనోహర్‌ జోషి, ఉమా భారతి తదితరులు ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చారిత్రక కేసులో తీర్పు వెల్లడి, హత్రాస్‌ సామూహిక అత్యాచార బాధితురాలి మృతి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు దళిత యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడటంతో రెండు వారాల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top