అద్వానీ రథయాత్రను అడ్డుకున్నారంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. 1990లో సమస్తిపుర్‌లో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. ఆ చర్యను ‘పాపం’గా అభివర్ణించారు. ఇవాళ బుధవారం(అక్టోబర్ 29) బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. సివాన్, భోజ్‌పూర్, బక్సర్ జిల్లాల్లో మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రామ మందిర నిర్మాణం.. దేశంపై 500 ఏళ్ల మచ్చను తొలగించిందని యోగి అన్నారు. ఆర్జేడీ మిత్రపక్షమైన కాంగ్రెస్.. రాముడు లేడని చెబుతోందంటూ.. 2007లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌ను ఆయన ఉదాహరించారు. ఆర్జేడీ అభ్యర్థి ఒసామా షహాబ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తండ్రి మొహమ్మద్ షహాబుద్దీన్ దేశవ్యాప్తంగా భయంకర గ్యాంగ్‌స్టర్‌గా పేరుగాంచిన వ్యక్తి అంటూ యోగి ఆరోపించారు. ఆర్జేడీ మళ్లీ 'జంగిల్ రాజ్'ను తీసుకురావాలని చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, భద్రతకు కట్టుబడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం కార్పూరీ ఠాకూర్, జగ్జీవన్ రామ్, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలపై పనిచేస్తోంది. సీతామఢి జిల్లాలో సీతాదేవి ఆలయ నిర్మాణానికి ఆర్జేడీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. అయోధ్య ధామ్ నుంచి సీతామఢి వరకు రూ. 6,100 కోట్లతో కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయని యోగి తెలిపారు.


