తమిళనాడు సీఎం విజయ్‌ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్‌ | Cm Vijay Returns To Chennai Without Meeting Rahul Gandhi In Delhi | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం విజయ్‌ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్‌

May 28 2026 7:14 PM | Updated on May 28 2026 7:40 PM

Cm Vijay Returns To Chennai Without Meeting Rahul Gandhi In Delhi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్‌తో విజయ్‌ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.

అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.

కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్‌ విజయ్‌ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం  దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్‌కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్‌ తిరిగి తమిళనాడు భవన్‌కు  చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.

ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోనూ విజయ్‌ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి  సోనియా, రాహుల్‌లతో భేటీ కాకుండానే విజయ్‌ పర్యటన ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement