మత్స్య ఉత్పత్తులపై సీఎం మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో మత్స్య ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించలేక పోయిందంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలపై సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ఆయన చెబుతున్నవన్నీ తప్పుడు గణాంకాలంటూ ఎదురుదాడికి దిగారు. ‘బిహార్ అత్యధికంగా మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా బెంగాల్‌లో వెనుకబడిపోయిందంటూ ప్రధాని మోదీ విమర్శించినట్లు తెలిసింది.
బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లో ప్రజలను మాంసాహారం, చేపలు, గుడ్లు తిననివ్వడం లేదు. అక్కడ బీఫ్, మాసం దుకాణాలను మూసివేస్తున్నారు. అందుకే, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, బిహార్, యూపీలు మాంసం, బీఫ్, చేపలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. బెంగాల్‌లో మాత్రం ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు కనిపిస్తాయి. ఇక్కడ దొరికే మత్స్య ఉత్పత్తులను ప్రతి వారూ ఇక్కడ ఆహారంగా వాడుతారు. అందుకే, దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’అంటూ ఆమె వివరించారు.
గతంలో ఏపీ నుంచి మత్స్య ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆమె అన్నారు. సొంత పార్టీ నేతలు చెప్పేవన్నీ యథాతథంగా వల్లెవేయడానికి బదులుగా, ఇలాంటి వాటిని కూడా మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు. గురువారం సీఎం మమత ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో టీఎంసీని ఓడించాలనే కుట్రతోనే సర్ ప్రక్రియలో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారని, అయినప్పటికీ విజయం ఖాయమని మమత స్పష్టం చేశారు.


