
లక్నో: నేపాల్ సంక్షోభాన్ని ఉటంకిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాలేనని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేపాల్‌లో ఏం జరిగిందో చూడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన లక్నోలోని రామ్ మనోహర్ లోహియా మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేపాల్‌లోని ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం.. అది పెద్ద సమస్యలకు దారి తీస్తుందన్నారు.
‘‘చిన్నవిగా కనిపించే విషయాలు, అవి పెద్ద సమస్యను తెస్తాయి. సమాజంలో అభివృద్ధి, పురోగతిని ఎలా అడ్డుకుంటాయో, అశాంతిని ఎలా రగిలిస్తాయో నేపాలే నిదర్శనం. జెన్-జడ్(Gen-Z) నిరసనకారుల ఆందోళనతో నేపాల్ హింసాత్మక ఘటనలు చవిచూసింది. కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పలువురు రాజకీయ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి.. మారుతున్న పరిస్థితులకు సిద్ధపడాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ కట్టుబడి ఉందన్నారు. వైద్య విద్యార్థులు, డాక్టర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతిక సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు.