
సంబల్‌పూర్: ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలోని బమ్రా తహశీల్దార్‌గా పనిచేస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్ష టాపర్ అశ్విని కుమార్ పాండా అవినీతికి పాల్పడుతూ ఒడిశా విజిలెన్స్ అధికారులకు దొరికిపోయారు. వ్యవసాయ భూమిని ఇంటి భూమిగా మార్చేందుకు ఒక వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగావిజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
నెల రోజుల క్రితం ఫిర్యాదుదారు తహశీల్దార్ కార్యాలయంలో భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
‘పాండా రూ. 20,000 లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారునికి అనుకూలంగా హక్కు రికార్డు (ఆఓఆర్)జారీ చేశాడు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేనని ఆ వ్యక్తి తహశీల్దార్ పాండాకు తెలిపారు. దీంతో పాండా లంచం మొత్తాన్ని రూ. 15,000 కు తగ్గిస్తూ, ఇది కూడా చెల్లించకుంటే మ్యుటేషన్ కేసులో ఈ మార్పిడిని అనుమతించబోనని పాండా బెదిరించాడని విజిలెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
దీనిపై ఫిర్యాదుదారు విజిలెన్స్ అధికారులను తెలియజేశాడు.దీంతో ఒక పథకం ప్రకారం అధికారులు శుక్రవారం వల వేసి, అశ్విని కుమార్ పాండాను పట్టుకున్నారు. అనంతరం పాండాకు చెందిన భువనేశ్వర్‌లోని ఇంటిలో తనిఖీలు చేపట్టి, రూ.4,73,000 విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన డ్రైవర్ పి ప్రవీణ్ కుమార్‌ను కూడా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ చేసిన పాండా 2019లో ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. 2021, డిసెంబర్‌లో జూనియర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఓఏఎస్)లో చేరి, ట్రైనింగ్ రిజర్వ్ ఆఫీసర్ (టీఆర్‌ఓ)గా ప్రభుత్వ సేవలో ప్రవేశించారు.