గంగోత్రి, యమునోత్రిల్లో పూజలు
డెహ్రాడూన్: ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం గంగోత్రి ఆలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రిలో మధ్యాహ్నం 12.35 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు. దీంతో, ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర తిరిగి మొదలైంది.
ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్లను, కెమెరాలను నిషేధించారు. చార్ ధామ్‌లో భాగమైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు ఈ నెల 22, 23వ తేదీల్లో తెరుచుకోనున్నాయి. గతేడాది చార్ ధామ్ యాత్రలో 51 లక్షల మంది పాల్గొనగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 లక్షల మంది నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.


