
మిడిల్ మేనేజ్‌మెంట్‌కు సవాళ్లు
కొత్తగా మధ్యస్థ మేనేజర్ల పాత్ర నిర్వచించాల్సిన ఆవశ్యకత
వీరి స్థాయిని తగ్గిస్తూ వేగవంత నిర్ణయాల లక్ష్యంతో టెక్ దిగ్గజాలు ముందుకు..
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం కంపెనీలు, ఆయా సంస్థల్లోని వ్యవస్థలు వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులుచేర్పులతో ఆర్థిక ఒత్తిళ్లు, సాంకేతికతలో పెరుగుతున్న వినియోగం, విధుల నిర్వహణలో సమర్థత సాధనకు కృషి అనే ఈ మూడు ప్రధాన అంశాల ప్రభావంతో సంస్థల నిర్మాణ విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల్లో మధ్యస్థ మేనేజర్ల (మిడిల్ మేనేజ్‌మెంట్) పాత్ర కొత్తగా నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది.
ఆ మార్పు ఉత్పత్తుల స్థాయిలోనే కాకుండా, సంస్థల అంతర్గత నిర్మాణంలోనూ జరుగుతోంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ‘గ్రేట్ ఫ్లాటెనింగ్‘అన్న పదం సిలికాన్ వ్యాలీలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో మారుతున్న ట్రెండ్‌కు సంకేతంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా మధ్యస్థ మేనేజ్‌మెంట్ స్థాయిని తగ్గిస్తూ, నిర్ణయాలు తీసుకునే మార్గాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో టెక్ దిగ్గజాలు ముందుకు సాగుతున్నాయి.
టెక్ కంపెనీలు సైతం తాము స్టార్టప్‌ల సెటప్ మాదిరిగా పనిచేయాలనే మానసిక స్థితిలో చిన్న బృందాలుగా, తక్కువ సంఖ్యలో మేనేజర్లతో ఎక్కువ ఉత్పాదకతను సాధించే లక్ష్యంతో ముందుకెళుతున్నాయి. చాట్‌బాట్‌లు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ వంటి వినియోగంతో మానవ వనరుల నిపుణుల అవసరం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే బాటలో దిగ్గజ కంపెనీలు
మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, ఇంటెల్ వంటి కంపెనీలు సైతం సంస్థాగత వ్యవస్థలను పునర్‌వ్యవస్థీకరిస్తూ మార్పులు తీసుకొస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు, సంస్థలు ఇప్పటికే ఈ మార్పులకు అనుగుణంగా మధ్యస్థ మేనేజర్ల పాత్రను కొత్తగా రూపుదిద్దేలా చర్యలు చేపట్టాయి. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి వాటిని ప్రవేశపెట్టి, మధ్యస్థ స్థాయి మేనేజ్‌మెంట్ పాత్రను తగ్గించేశాయి. దీని వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడడంతో పాటు మేనేజర్లను వ్యూహాత్మక విధానాల్లోకి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి.
అనుకూల అంశాలు
సమర్థత, వేగవంతమైన నిర్ణయాలు: బ్యూరోక్రసీని తగ్గించి, చిన్న బృందాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేయాలన్నదే లక్ష్యం. దీంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. మార్కెట్‌కు అనుగుణంగా వేగంగా స్పందించొచ్చు
వ్యయాల తగ్గింపు : ఉద్యోగుల జీతాలు, ముఖ్యంగా మేనేజ్‌మెంట్ స్థాయిలో అధికంగా ఉండటంతో వాటిని తగ్గించడం ద్వారా కంపెనీలకు ప్రయోజనాలు చేకూరుతాయి. తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఇది కీలకంగా మారింది.
ఇన్నోవేషన్‌కు మద్దతు: మధ్యస్థ మేనేజ్‌మెంట్ లేకపోతే, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నేరుగా పనిచేసే ఉద్యోగులకు ఇవ్వొచ్చు.దీనివల్ల సృజనాత్మకత పెరిగే అవకాశముంది
ప్రతికూల అంశాలు
మిగిలిన మేనేజర్లపై పనిభారం : తగ్గిన మేనేజ్‌మెంట్ వ్యవస్థకు ప్రత్యా మ్నాయం లేకపోవడం వల్ల మిగిలిన వారిపై అధిక పనిఒత్తిడి పెరుగుతోంది. ఇది ‘బర్నౌట్’కు దారితీయొచ్చు
నాయకత్వలోపం : తొలగించిన మేనేజ్‌మెంట్‌ల స్థాయిల కారణంగా లీడర్ షిప్ గ్యాప్ ఏర్పడి, టీమ్‌ల పనితీరు దెబ్బతినే అవకాశముంది
సీనియర్ స్థాయిలో మైక్రో మేనేజ్‌మెంట్ : మధ్యస్థ స్థాయి లేకపోతే, టాప్ లెవల్ లీడర్íÙప్ చిన్న విషయాల దాకా జోక్యం చేసుకోవడం వల్ల ఇది వ్యతిరేక ఫలితాన్నే కలిగించొచ్చు.
ప్రమోషన్ అవకాశాల తగ్గుదల : మంచి ప్రతిభ కనబరిచే వారికి మధ్యస్థ మేనేజర్ స్థాయికి చేరే అవకాశాలు తగ్గి.. కెరీర్ ఎదుగుదలకు బ్రేకులు పడే ప్రమాదం.
సవాళ్లు ఎదురవుతున్నా.. అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి
కంపెనీలు, సంస్థలు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తూ, కార్యకలాపాల్లో సమర్థత పెంపుదల కోసం మార్గాలు వెతుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు ఫ్లాట్ (అంటే తక్కువ మేనేజ్‌మెంట్ లేయర్లతో కూడిన) సంస్థలుగా మారుతున్నాయి. దీనివల్ల వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో మధ్యస్థ మేనేజర్లు అధికంగా ›ప్రభావితం అవుతున్నారు. వారికి సవాళ్లు ఎదురవుతున్నా, అనేక అవకాశాలు కూడా అందుబాటులో వస్తున్నాయి. – వెంకారెడ్డి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, క్వాలీ జీల్ ఐఎన్‌సీ