
సంగీతం అంటే కేవలం వినిపించే గీతం కాదు, అది ఒక ఊరట, ఉల్లాసం, సంతోషం. మ్యూజిక్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ గాడ్జెట్లు మీ సంగీత ప్రయాణాన్ని మరింత ఆనందభరితంగా మార్చగలవు. మీ తీరికవేళలను మరింత ఉల్లాసంగానూ మార్చగలవు.
డీజే బాల్
బాల్ అంటే కేవలం ఆడుకోవడానికే మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు అదే బాల్ సంగీతం కూడా వినిపిస్తుంది. పేరు ‘ఆడ్ బాల్’. ఈ బాల్‌ను కాస్త షేక్ చేస్తే డమ్ డమ్, తిప్పితే చిక్ చిక్, ఒక్కసారిగా విసిరేస్తే ఉష్ ఉష్! బంతి గాల్లో ఎగిరినా, మీ చెవుల్లో మాత్రం కిక్ ఇచ్చే మిక్స్ సాంగ్‌ని వినిపిస్తుంది. డీజే అవ్వాలని కలలు కనే వాళ్లకు, కానీ ఖరీదైన సెటప్ పెట్టలేనివాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. పిల్లలకు సరదా ఆట వస్తువు, పెద్దలకు ఒత్తిడి తగ్గించే రిలాక్స్ టాయ్. నీటి చినుకులు పడినా ఇబ్బంది లేదు. జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బరువు కేవలం రెండు చాక్లెట్లు తిన్నంతే వంద గ్రాములు. యాప్ సాయంతో కనెక్ట్ చేసి, ముందే రికార్డు చేసిన పాటలను కూడా బంతితో కలిపి మిక్స్ చేయొచ్చు. ధర 99 డాలర్లు, అంటే రూ. 8,786.
ఛోటా ప్యాకెట్ బడా ధమాకా!
చిన్నగా కనిపించే ఈ మ్యూజెన్ మినీ స్పీకర్ నిజంగా మినీ అని మోసపోకండి. చేతిలో పట్టుకునేంత చిన్నదైనా, సౌండ్ మాత్రం గది మొత్తం మారుమోగేలా మ్యాక్సీగా వినిపిస్తుంది. మెటల్ బాడీతో స్టయిలిష్ లుక్ దీని సొంతం. పసుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు ఏ రంగులో చూసినా క్యూట్ గిఫ్ట్‌లా అనిపిస్తుంది. పైగా లాన్యార్డ్‌తో వస్తుంది కాబట్టి బ్యాగ్‌కి, జీన్స్ కి తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ టేబుల్‌పై పెట్టినా రెట్రో డెకార్‌లా మెరవడం ఖాయం. బ్లూటూత్ కనెక్టివిటీతో సులభంగా ఫో¯Œ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు నిర్విరామంగా ఏడు గంటల పాటు పనిచేస్తుంది. వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, ట్రాక్ మార్చడం అన్నీ ఒకే చేతితో చేసుకునేలా బటన్స్ కూడా ఉంటాయి. త్రీ వాట్స్ పవర్ సౌండ్ క్వాలిటీతో క్లియర్ హైఫై సౌండ్ ఇస్తుంది. ధర 59 డాలర్లు దాదాపు రూ. 5,236.
పార్టీకి నవ్వుల ప్యాకెట్
ఒక పార్టీకి కావాల్సింది నవ్వులు, సవాళ్లు, కొంచెం గందరగోళం. అచ్చం అలాంటి ఆలోచనతో వచ్చిందే ఈ ‘మిస్ అండర్‌స్టాడింగ్ సాంగ్స్’ గేమ్. ఇందులోని 300 కార్డుల్లో ప్రతి ఒక్కటి వింతగా, సరదాగా తప్పుగా వినిపించే లిరిక్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఆ కార్డులోని లిరిక్స్ చదివినపుడు నవ్వకుండా ఉండలేరు. కాని, అవి ఒక పాపులర్ పాటకు సంబంధించిన క్లూస్. ఈ ఆటలో రెండు నుంచి ఎనిమిది మంది కలిసి ఆ లిరిక్స్ నిజంగా ఏ పాట నుండి వచ్చిందో గుర్తించేందుకు పోటీ పడతారు. ఒకే గేమ్ రూమ్‌లో, స్నేహితులతో చక్కగా నవ్వుతూ ఆడవచ్చు, ఎలాంటి సందర్భానికైనా సరిపోయే సరదా గేమ్ ఇది. కాలేజ్ డార్మ్ నైట్, హ్యాపీ అవర్, బ్యాచిలర్ పార్టీ ఏ సందర్భంలోనైనా ఇది ఉల్లాస వాతావరణాన్ని సృష్టిస్తుంది. ధర 18 డాలర్లు. రూ. 1,597.