రాబోయే పదేళ్లలో రూ.28,840 కోట్లతో అమలు
100 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి
200 ఆధునిక హెలిప్యాడ్‌లు
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయంగా విమానయానాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్వహణకు నిధుల సహకారం, హెలిప్యాడ్‌ల ఏర్పాటు, మేడ్ ఇన్ ఇండియా విమానాల కొనుగోలుకు మద్దతు కోసం ‘సవరించిన ఉడాన్’పథకానికి అమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సవరించిన ఉడాన్ పథకాన్ని రాబోయే పదేళ్లలో రూ.28,840 కోట్లతో అమలు చేయబోతున్నారు. ‘ఉడాన్’మార్గాల్లో ప్రయాణించే విమానాల విషయంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీపీ) కింద 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి పదేళ్లలో రూ.10,043 కోట్లు ఖర్చు చేస్తారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. సవరించిన ఉడాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 100 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.12,159 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
అలాగే 200 ఆధునిక హెలిప్యాడ్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఒక్కో హెలిప్యాడ్‌కు రూ.15 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో సేవల కోసం రెండు హెచ్‌ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లు, రెండు హెచ్‌ఏఎల్ డార్నియర్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. 2026–27 నుంచి 2035–36 దాకా పదేళ్లపాటు ఈ సరికొత్త ఉడాన్ పథకం అమలు కాబోతోంది. ఉడాన్ స్కీమ్‌ను తొలుత 2016 అక్టోబర్‌లో ప్రారంభించారు. 95 ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్ నుంచి 633 మార్గాలను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చారు. పాత ఉడాన్ పథకం కాలపరిమితి ఈ ఏడాది ఆఖర్లో ముగియనుంది.


