జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఫలోడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు సమాచారం మేరకు.. రాజధాని జైపూర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫలోడి జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్ నుంచి బయలుదేరి.. బికనీర్ జిల్లా కోలాయత్ పట్టణంలో దైవ దర్శనం చేసుకని తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ దుర్ఘటపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ప్రకటించారు.
మరోవైపు జసల్మేర్ రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. గత నెల (అక్టోబర్ 14)న జైసల్మేర్ సమీపంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు రాష్ట్రంలో రవాణా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, వైద్య సేవలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


