
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు: మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వధువు, ఆమె బంధువులు ఆలయానికి చేరుకున్నారు. వరుడు ఎంతకూ రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి చూడగా మద్యం మత్తులో పడివున్నాడు. తీరా అతన్ని తీసుకురాగా వివాహం చేసుకోవడానికి వధువు నిరాకరించింది. మద్యం జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపే ఈ ఉదంతం కృష్ణగిరిలో జరిగింది.
వివరాలు.. ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని తొట్ట హడక్కాన్ హళ్లికి చెందిన శరవణన్ (32) కార్మికుడు. ఇతనికి తిరువణ్ణామలైలోని చెంగం నెహ్రునగర్‌కు చెందిన యువతి (22)తో శుక్రవారం పెళ్లి నిశ్చయించారు. రాయకోటై వజ్రపళ్లం శివాలయంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం వధువు తరఫు వారు ఆలయానికి చేరుకున్నారు.
చాలా సమయం అయినా వరుడి ఇంటి వారు రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి చూశారు. శరవణన్ మద్యం మత్తులో లేవడానికి వీలుకాని స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని మారండహళ్లి పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న శరవణన్ క్షమించమని కోరినా వధువు ఒప్పుకోకపోవడంతో వివాహం ఆగిపోయింది. వివాహానికి చేసిన ఖర్చును వరుడి ఇంటి వారు తిరిగి ఇవ్వాలని పోలీసుస్టేషన్‌లో ఒప్పందం చేసుకున్నారు.