హ్యాకింగ్‌ చేయబోయి అడ్డంగా బుక్కయిన బాలుడు

Boy demands her Dad Rs 10-crore in Ghaziabad - Sakshi

ఘజియాబాద్‌: సోషల్‌ మీడియాతో చిన్నారులు పక్కదారి పడుతున్నారనే దానికి మరో నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన. యూట్యూబ్‌లో సైబర్‌ క్రైమ్‌ వీడియో చూసి ఏకంగా తండ్రికే రూ.పది కోట్లు డిమాండ్‌ చేశాడో ఓ బాలుడు. ఈమెయిల్‌ హ్యాక్‌ చేసి మీ వ్యక్తిగత వివరాలు, కుటుంబసభ్యుల ఫొటోలు బహిరంగ పరుస్తానని బెదిరించాడు. రూ.పది కోట్లు ఇస్తే వదిలేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది.

ఘజియాబాద్‌లోని ఓ వ్యక్తి జనవరి 1వ తేదీన తన ఈమెయిల్‌, ఇతర వివరాలు హ్యాకయ్యాయని.. ఎవరో ఫోన్‌ చేసి తనకు రూ.పది కోట్లు ఇవ్వాలని.. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ వ్యక్తిగత వివరాలతో పాటు ఫొటోలు బయటపెడతానని హెచ్చరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఎక్కడి నుంచి బెదిరింపులు వస్తున్నాయో పోలీసులు ఆరా తీశారు. ఐపీ అడ్రస్‌ పరిశీలించగా ఫిర్యాదుచేసిన వ్యక్తి ఇంటి నుంచే వస్తుండడం పోలీసులకు షాకిచ్చింది. దీంతో ఇంట్లో వివరాలు సేకరించగా అతడి కుమారుడే ఈ పని చేస్తున్నాడని గ్రహించి అవాక్కయ్యారు.

ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో సైబర్‌ క్రైమ్‌ వీడియోలు చూసి ఇలా తండ్రిపైనే ప్రయోగించాడని పోలీసులు గుర్తించారు. హ్యాకింగ్‌కు సంబంధించిన వీడియోలతో పాటు ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన వీడియోలు చూసి తాను నేర్చుకున్నట్లు బాలుడు పోలీసులకు తెలిపాడు. ఆ విధంగా తండ్రికి ఇతర మెయిల్స్‌ నుంచి పంపి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆ బాలుడు వివరించడంతో పోలీసులు నోరు వెళ్లబెట్టారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top