
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని 300కు పైగా స్కూళ్లు, సంస్థలతోపాటు పలు విమా నాశ్రయాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. సంబంధిత విభాగాలు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని, బెదిరింపులు వట్టివేనని తేల్చారు. ఇంతకుముందు హెచ్చరికలు పంపిన ’Terrorizers111’ అనే గ్రూప్ నుంచే తాజా ఈమెయిల్ హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఆదివారం ఉదయం 6.08 గంటల సమయంలో ఇవి ఢిల్లీలోని విమానాశ్రయంతోపాటు పలు స్కూళ్లు, ఇతర సంస్థలకు అందాయి. ‘మీ భవనం చుట్టూ బాంబులు అమర్చాం. 24 గంటల్లోగా స్పందిస్తారా విధ్వంసాన్ని ఎదుర్కొంటారా’అని అందులో ఉంది. ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్, కుతుబ్ మినార్ వద్దనున్న సర్వోదయ విద్యాలయకు ఇలాంటి బెదిరింపే అందిందని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఢిల్లీలోని పలు సంస్థలకు బాంబు హెచ్చరికలు అందుతుండటం, అవన్నీ వట్టిదేనని అధికారులు సోదాల అనంతరం ప్రకటిస్తుండటం తెల్సిందే.