పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే చొరబాట్లకు అడ్డుకట్ట
మహిళలు, యువత, రైతులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం
ఉద్యోగాలు వచ్చేదాకా యువతకు నెలకు రూ.3 వేలు
పూర్తిగా మహిళా పోలీసులతో ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు
బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. పొరుగుదేశాల నుంచి చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. వారి కోసం సంక్షేమ పథకాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)కు ఇదొక రోడ్ మ్యాప్ అని ఆయన అభివరి్ణంచారు. అవినీతి, రాజకీయ హింస, చొరబాట్లు, నిరుద్యోగ సమస్యకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రెఫరెండమ్ అని తేల్చిచెప్పారు.
మహిళలకు ఉచిత ప్రయాణం
రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన ఆక్రమణదారులను, చొరబాటుదార్లను అక్కడి నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. ఆయా భూములకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజా రవాణా సంస్థ వాహనాల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
అధికార పార్టీ అవినీతి వ్యవహారాలు, ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి ఐదేళ్లపాటు వయసు సడలింపు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలను పారదర్శకంగా, నైపుణ్యాల ఆధారంగా భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఉద్యోగుల కోసం ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు.
చేపలు, గుడ్లపై నిషేధం ఉండదు: అమిత్ షా
బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ బిడ్డనే పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే చేపలు, గుడ్లపై నిషేధం విధిస్తారంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నిషేధం ఉండదని స్పష్టంచేశారు.
బీజేపీ సంకల్ప పత్రలో కీలకాంశాలు..
→ బెంగాల్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం చట్టం.
→ అక్రమ వలసలపై కఠిన చర్యలు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట.
→ ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా చట్టం.
→ మహిళలకు ప్రతినెలా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. వారి సాధికారతకు చేయూత.
→ పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.
→ కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేదాకా నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం.
→ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం కేంద్ర రేట్లకు అనుగుణంగా మార్పు. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల అమలు.
→ 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దిగజారిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల.
→ కట్ మనీ(చట్టవిరుద్ధమైన కమిషన్లు/లంచాలు) సంస్కృతికి చరమగీతం. సిండికేట్ వ్యవస్థ అంతం.
→ ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్‌లోనూ అమలు. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఏర్పాటు.
→ వరి, బంగాళదుంప, మామిడి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు. పంటలకు గిట్టుబాటు ధరలు.
→ రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోకి కుర్మాలీ, రాజ్‌బన్షీ భాషలు.
→ అత్యున్నత పారిశ్రామిక హబ్‌గా బెంగాల్ అభివృద్ధి. అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు.
→ పాత తేయాకు తోటల పునరుద్ధరణ. డార్జీలింగ్ తేయాకుకు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు లభించేలా చర్యలు. జనపనార పరిశ్రమ ఆధునీకరణ.
→ రాష్ట్రంలో వందేమాతరం మ్యూజియం నిర్మాణం.


