మొత్తం 71 స్థానాల్లో ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే
గత ఎన్నికల్లో 20 నియోజకవర్గాల్లో పోటీ
ఈసారి 18 స్థానాల్లో బరిలో నిలిచిన హస్తం అభ్యర్థులు
ఇబ్బందికరంగా మారిన అంతర్గత కుమ్ములాటలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో విపక్షాల మహాగఠ్‌బంధన్ కూటమిలో ఆర్జేడీ తర్వాత కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరబిహార్ ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకునేందుకు పెద్ద పోరాటమే చేస్తోంది. ఉత్తరబిహార్ పరిధిలో మొత్తం 71 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయకేతనం ఎగరేసింది. ఈసారి ఆ ఒక్క సీటును కూడా నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద పరీక్షలా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెమ్మదినెమ్మదిగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 2010 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఓటమిని మూటగట్టుకున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. వారిలో ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తర బిహార్‌లోని 71 నియోజకవర్గాల్లో ఒక్క ముజఫర్‌పూర్‌లో మాత్రమే విజేంద్ర చౌదరి గెలిచారు. ఈసారి కూడా ఆయనే బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో సరైన అభివృద్ధి పనులు చేపట్టలేదని స్థానిక ఓటర్లు ఈయనపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ఈసారి ఈయన విజయావకాశాలకు గండిపడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ నేతలు తమ శాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.
ఉమేష్ కుమార్ రామ్(సక్రా నియోజకవర్గం), నలిని రంజన్ ఝా రూపం(బెనిపట్టి), సుబోధ్ మండల్(ఫుల్పరస్), అమిత్ కుమార్ తన్నా(రిగా), ఇంజనీర్ నవీన్ కుమార్(బత్నాహా), సయ్యద్ అబు దోజన(సుర్సాండ్), శ్యామ్ బిహారీ ప్రసాద్(రక్సౌల్), శశి భూషణ్ రాయ్(గోవింద్ గంజ్), అమిత్ కుమార్(నౌతన్), అభిషేక్ రంజన్(చన్పాటియా), వాసి అహ్మద్(బెట్టియా), శశ్వత్ కేదార్(నర్కటియాగంజ్), సురేంద్ర ప్రసాద్(వాల్మీకినగర్), జయేష్ మంగళ్ సింగ్(బాగహా), మిథిలేష్ చౌదరి(బేనీపూర్), రిషి మిశ్రా(జాలే), రవి(రోసెరా) సైతం ఎన్నికల రణరంగంలో దూకి తమ రాజకీయచతురతతో విజయపతాక ఎగరేద్దామని ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఎన్‌డీఏ పార్టీ అభ్యర్థుల నుంచి వీళ్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నాడు పార్టీని అణచివేసి.. నేడు అభ్యర్థిగా విజయం..
ఉత్తర బిహార్ ప్రాంతంలో ఈసారి మొత్తం 18 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 20 చోట్ల కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. 1977 ఏడాదికి ముందు ముజఫర్‌పూర్ జిల్లాలోని మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. కానీ.. ఇప్పుడు కేవలం విజేంద్ర చౌదరి మాత్రమే ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1995 ఎన్నికల్లో ముజఫర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని విజేంద్ర చౌదరి పూర్తిగా తుడిచిపెట్టేశారు. గతంలో పలుమార్లు జేడీయూ, ఆర్జేడీ తరఫున, స్వతంత్ర అభ్యర్థిగానూ ఎన్నికల బరిలో దిగారు. 2019 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేశ్‌కుమార్ శర్మను ఓడించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు.
90వ దశకం నుంచే పరాజయాల చరిత్ర
గత రెండున్నర దశాబ్దాలుగా ముజఫర్‌పూర్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం గుర్తుకు ఓటర్లు ముఖం చాటేయడం మొదలెట్టారు. 1972 వరకు కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఎదురేలేదు. తర్వాత ఇక్కడి ఓటర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు కన్పించింది. పార్టీ కేడర్‌లో అంతర్గత కుమ్ములాటలు, స్థానికేతరులు జోరు పెంచడంతో ఓట్ల రేసులో కాంగ్రెస్ వెనుకబడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ముజఫర్‌పూర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ముజఫర్‌పూర్ నుంచి బిజేంద్ర చౌదరి, పారు నుంచి అనునయ్ ప్రసాద్ సిన్హా, సక్రా నుంచి ఉమేష్ కుమార్ రామ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ ముగ్గురిలో బిజేంద్ర ఒక్కరే గెలిచారు. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా జిల్లాలో కాంగ్రెస్ ఉనికిని చాటారు. ఈ సారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.


