మహోజ్వల భారతి: బొబ్బిలిపై గెలిచారు!

Azadi Ka Amrit Mahotsav Freedom Fighter VV Giri - Sakshi

వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్‌ పట్టణంలోని వరాహగిరి వెంకట జోగయ్య, సుభద్రమ్మ దంపతులకు ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో 1894 ఆగస్టు 10 న జన్మించారు. తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్లారు. వి.వి.గిరి 1913లో డబ్లిన్‌లోని యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. కానీ ఐర్లండ్‌ లో సీన్‌ఫెన్‌ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యాడు.

ఆ ఉద్యమకాలంలోనే ఆయనకు ఈమొన్‌ డి వలేరా, మైఖెల్‌ కోలిన్స్, పాట్రిక్‌ పియర్సె, డెస్మండ్‌ ఫిట్జెరాల్డ్, ఈయోన్‌ మెక్‌నీల్, జేమ్స్‌ కాన్నలీ తదితర రాజకీయ ప్రముఖులతో సన్నిహితం ఏర్పడింది. భారతదేశం తిరిగివచ్చిన తర్వాత ఇక్కడి కార్మిక ఉద్యమాలలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యారు. రెండుసార్లు అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1934లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో సభ్యుడయ్యారు.

1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్‌లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు. 1969లో భారత రాష్ట్రపతి అయ్యేవరకు.. ఉపరాష్ట్రపతిగా, మైసూరు రాష్ట్ర గవర్నరుగా; కేరళ, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌గా, మద్రాసు ప్రెసిడెన్సీలో కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆ పదవులకు వన్నె తెచ్చారు. 1980 జూన్‌ 24న 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 

(చదవండి: చైతన్య భారతి: అనితా దేశాయి )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top