బాలరామునికి ‘సూర్యతిలకం’ | Ayodhya witnessed an overwhelming influx of devotees | Sakshi
Sakshi News home page

బాలరామునికి ‘సూర్యతిలకం’

Mar 28 2026 4:05 AM | Updated on Mar 28 2026 4:05 AM

Ayodhya witnessed an overwhelming influx of devotees

అయోధ్యలో నేత్రపర్వంగా క్రతువు 

9 నిమిషాలు నుదుటిపై సూర్యకిరణాలు 

10 లక్షల మందికి పైగా పోటెత్తిన భక్తులు 

అయోధ్య: శ్రీరామ నవమి సందర్భంగా దేశం నలుమూలల నుంచీ పోటెత్తిన భక్తులతో అయోధ్య జనసంద్రమైంది. శుక్రవారం ఏకంగా 10 లక్షల మంది బాలరామున్ని దర్శించుకున్నారు. సరిగ్గా మధ్యాహ్న సమయంలో అభిజిత్‌ ముహూర్త వేళ బాలరాముడు తొమ్మిది నిమిషాల పాటు నుదుట ‘సూర్యతిలకం’తో దర్శనమివ్వడం విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అమర్చిన లెన్సులు, అద్దాల ద్వారా సూర్యకిరణాలను సరిగ్గా బాలరాముని విగ్రహం నుదుటి భాగాన పడేలా చేశారు. 14 మంది అర్చకుల ఆధ్వర్యంలో వైదిక పద్ధతిలో క్రతువు పరిసమాప్తమైంది.

అనంతరం 56 రకాల ప్రసాదాలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. అయోధ్య ఆలయంలో బాలరామున్ని 2024 జనవరి 22న ప్రతిష్టించడం తెలిసిందే. అనంతరం మూలమూర్తికి సూర్యతిలక క్రతువు నిర్వహించడం ఇది వరుసగా రెండో ఏడాది. దీన్ని భక్తులంతా దర్శించుకునేందుకు వీలుగా నగరమంతటా భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అంతకుముందు తెల్లవారుజాము నుంచే బాలరామునికి ప్రత్యేక పూజలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి నుంచీ భక్తులు భారీగా బారులు తీరారు. దాంతో ప్రధానాలయానికి దారితీసే రామ్‌పథ్, భక్తి పథ్, జన్మభూమి పథ్‌ తదితర మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నగరమంతటా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

వర్చువల్‌గా వీక్షించిన మోదీ 
అయోధ్య బాలరామునికి సూర్యతిలక ధారణ క్రతువును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా వీక్షించారు. ఇది అద్భుత అనుభూతినిచి్చందని ఎక్స్‌ పోస్టులో ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ రాముని దీవెనలు అందాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement