
భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు.. అక్కడితో ఆగలేదు.. ఇక తాను స్వేచ్ఛాజీవినంటూ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులను నాలుగు బకెట్ల పాల స్నానంతో వేడుక చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీకి భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ భార్యభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త.. పాలతో స్నానం చేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు.
తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడంటూ చెప్పుకొచ్చిన మాణిక్ అలీ.. తనతో పెళ్లై ఓ బిడ్డ జన్మించినా కానీ.. ఆమె తీరు మారలేదని.. తన ప్రియుడితో వివాహేతర బంధం కొనసాగించిందని తెలిపాడు.. తనను, తన బిడ్డను వదిలేసి ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఇలా.. ఒక్కసారి కాదు రెండు సార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు.

మొదటిసారి తప్పు చేసినప్పుడు తన బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మా కుటుంబం శాంతి కోసం తాను మౌనంగా ఉన్నానని.. మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని మాణిక్ అలీ తెలిపారు. విడాకులు తీసుకున్నాక.. కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని.. ఈ రోజు నుండి తాను విముక్తి పొందానని.. కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానంటూ మాణిక్ అలీ చెప్పాడు.