బిహార్ ప్రజలే తేల్చుకోవాలి
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పిలుపు
గోపాల్‌గంజ్: మోదీ–నితీశ్ కుమార్‌ల అభివృద్ధి అజెండా కావాలో లేక రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జంగిల్‌రాజ్ కావాలో తేల్చుకోవాలని బిహార్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. అభివృద్ధి పట్టం కట్టాలా? లేక ఆటవిక రాజ్యం కావాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. శనివారం బిహార్‌లో గోపాల్‌గంజ్, సమస్తీపూర్, వైశాలి జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా వర్చువల్‌గా ప్రసంగించారు.
వాతవరణం అనుకూలించకపోవడంతో ఆయా ప్రాంతాలకు ఆయన చేరుకోలేకపోయారు. బిహార్ అభివృద్ధి బాధ్యతను ఎవరికి అప్పగించాలో నిర్ణయించడానికి ఈ ఎన్నికలు ఒక సువర్ణావకాశమని అమిత్ షా చెప్పారు. గతంలో ఆర్జేడీ పాలనలో ఎన్నో అకృత్యాలు జరిగాయని వెల్లడించారు. అప్పట్లో నక్సలైట్లు పెట్రేగిపోయారని, రక్తం ఏరులై పారిందని అన్నారు. భూస్వాముల ప్రైవేట్ సైన్యాలు ప్రజలపై పెత్తనం చెలాయించాయని గుర్తుచేశారు. ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ రావొద్దంటే ఆర్జేడీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో ఎన్డీయేకు మరోసారి అధికారం కట్టబెడితే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రైతులు, మహిళల సంక్షేమానికి ఎన్డీయే మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్లు తెలిపారు. 1.41 కోట్ల మంది జీవికా దీదీల ఖాతాల్లోకి ఇటీవల ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారికి రూ.2 లక్షల దాకా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 27 లక్షల మంది రైతులకు ప్రతి ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని చక్కెర కర్మాగారాలను మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాటుదారులను కాపాడేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన ఓటర్ అధికార్ యాత్రను తప్పుపట్టారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా చొరబాటుదారులను బయటకు పంపించడం తథ్యమని అమిత్ షా తేల్చిచెప్పారు.


