గూగుల్ వేదికగా రోజంతా నెటిజన్ల వెతుకులాట
2020 మార్చి 24న మొదలైన దేశవ్యాప్త కోవిడ్ లాక్‌డౌన్
తాజాగా ప్రధాని ప్రసంగాన్ని వక్రీకరిస్తూ పోస్టులు
ఐఈఏ ప్రకటననూ తప్పుగా వ్యాప్తి చేసిన వైనం
దీంతో ఆందోళనకు గురై ఆన్‌లైన్‌లో ఆరా
సాక్షి, స్పెషల్ డెస్క్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2020 మార్చి 24న ప్రకటించిన దేశవ్యాప్త కోవిడ్–19 లాక్‌డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో లాక్‌డౌన్ అనే అంశంపై గూగుల్ వేదికగా మంగళవారం రోజంతా చర్చ సాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై సోమవారం పార్లమెంటులో ప్రసంగించే క్రమంలో ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులను కోవిడ్ మహమ్మారితో పోల్చారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఏర్పడిన అంతరాయాన్ని ఎదుర్కోవడానికి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చూపినటువంటి సామూహిక సహనం, ఐక్యత, సంసిద్ధతను ప్రజలు ప్రదర్శించాలని ఆయన కోరారు.
అదే సమయంలో పౌరులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ నిర్ణయాలను నమ్మాలని ప్రధాని ఉద్ఘాటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త లాక్‌డౌన్‌కు సంకేతమని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమైంది. నాటి దేశవ్యాప్త దిగ్బంధం, నిర్జన రోడ్లు, లక్షలాది మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం, కార్యాలయాలు అకస్మాత్తుగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలోకి మారడం వంటి ఆనాటి దుర్భర పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని నెటిజన్లు కంగారుపడ్డారు.
దీనికితోడు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇంధన పొదుపు కోసం 10 సూచనలు చేస్తూ వాటిని ‘కోవిడ్ తరహా చర్యలు’గా అభివరి్ణంచింది. అయితే ఇది కూడా సోషల్ మీడియాలో తప్పుగా వ్యాప్తి చెందింది. ఐఈఏ పేర్కొన్న ‘స్వచ్ఛంద’ అనే పదాన్ని తీసేసి ఇది ప్రభుత్వం విధించబోయే ‘తప్పనిసరి’ ఆదేశమంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు తప్పుగా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవన్నీ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు మరింత అగ్గిరాజేశాయి. నెట్టింట లాక్‌డౌన్ చర్చకు కారణమయ్యాయి.


