సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘ఆర్‌ఎస్‌పై నిషేధం విధించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వల్లభ్ భాయ్ పటేల్ కు ప్రధాని, అమిత్ షా గౌరవం ఇవ్వాలనుకుంటే ఇది జరగాలి. దేశంలో జరుగుతున్న ఘర్షణలకు, శాంతి భద్రతల సమస్యలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లే కారణం’అని అన్నారు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ‘గాం«దీజీని హత్య చేసిన వారే.. పటేల్‌ను కాంగ్రెస్ స్మరించదంటున్నారు. మహాత్ముని హత్య తర్వాత అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. అయితే.. 9 జూలై 2024న 81ఏళ్ల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న నిషేధాన్ని మోదీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. దీనిని రద్దు చేయాలని మేము ఇప్పటికీ కోరుతున్నాం’’అని ఖర్గే స్పష్టం చేశారు.


