
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూకేలో పర్యటించారు. ఈ సందర్భంగా నలుపురంగు సూట్ ధరించిన ఒక మహిళా అధికారి ప్రధాని మోదీకి రక్షణగా నిలిచిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఆమె ఎవరనే చర్చ ఇంటర్నెట్‌లో మొదలయ్యింది. ఆమె ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.
వైరల్ ఫొటోలో ప్రధాని మోదీ వెనుక రక్షణగావున్న ఆ మహిళా అధికారి పేరు అదాసో కపేసా. ప్రధాని రక్షణ బాధ్యతలు వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)లో పనిచేస్తున్న మొట్టమొదటి మహిళ ఆమె. అదాసో కపేసా మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని కైబి గ్రామానికి చెందిన మహిళ. స్థానిక పాఠశాలలో చదువు పూర్తి చేసిన అనంతరం ఆమె సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)లో చేరారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లోని 55వ బెటాలియన్‌లో విశిష్ట సేవలందించారు. ఆమె తన పనితీరుతో సీనియర్ అధికారుల నుండి అభినందనలు అందుకున్నారు. ఎంతో కఠినమైన కమాండో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఎస్‌పీజీకి ఎంపికయ్యారు.
ఎస్‌పీజీ అనేది దేశంలోని అత్యంత ఉన్నత భద్రతా విభాగం. ఇది ప్రధాని, అతని కుటుంబ సభ్యులకు గట్టి భద్రత కల్పిస్తుంది. ఎస్‌పీజీలో ఎంపిక కావాలంటే ఆయుధ శిక్షణ, యుద్ధ కళలు, బాంబు నిర్వీర్యం తదితర అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో పలు శారీరక, మానసిక పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదాసో కపేసా 2020లో ఎస్‌పీజీ కమాండో శిక్షణను పూర్తి చేసి, 2024లో ప్రధాని ప్రధాన భద్రతా బృందంలో చేరారు. ఇంతటి అత్యున్నత బాధ్యతలు చేపట్టిన అదాసో కపేసా మహిళలకు స్ఫూర్తినందిస్తున్నారు.
1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే హత్య చేసిన దరిమిలా 1985లో ఎస్‌పీజీ ఏర్పాటయ్యింది. ప్రధాని రక్షణ బాధ్యత ఎస్‌పీజీ అధికారులపై ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్ తదితర సాయుధ విభాగాల నుండి ఎస్‌పీజీ సిబ్బందిని నియమిస్తారు. భారతదేశ భద్రతా వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందనడానికి అదాసో కపేసా ఒక ఉదాహరణగా నిలిచారు.