
అనర్హుల తొలగింపులో ఆ రెండు పార్టీలు మాత్రమే సహకరించాయి: ఈసీ
న్యూఢిల్లీ: బిహార్‌లోని 7.24 కోట్ల మంది ఓటర్లకుగాను ఇప్పటి వరకు 99.5 శాతం మంది వెరిఫికేషన్ కోసం ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు ఎన్నికల కమిషన్
(ఈసీ) సోమవారం వెల్లడించింది. ముసాయిదా ఓటరు జాబితాలో అనర్హుల పేర్ల తొలగింపులో ఆర్‌జేడీ, సీపీఐఎంఎల్‌లు మాత్రమే తమకు సాయం చేశాయని ఈసీ వివరించింది.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన సీపీఐ ఎంఎల్ 103 మంది పేర్లను తొలగించాలని కోరగా, ఆర్‌జేడీ, సీపీఐఎంఎల్‌లు కలిసి 25 పేర్లను కలపాలని దరఖాస్తులను అందించాయని పేర్కొంది. గుర్తింపు జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రమే ఓటరు ముసాయిదాకు సంబంధించిన 16 అభ్యంతరాలను అందజేసిందని వివరించింది. బిహార్ ఎస్‌ఐఆర్‌పై మార్పులు, చేర్పులకు ఆఖరు రోజైన సోమవారం భారీగా దరఖాస్తులు అందాయని వెల్లడించింది.
జాబితా నుంచి తొలగించాలని ఏకంగా 2.17 లక్షల దరఖాస్తులు అందగా, తమ పేర్లను చేర్చాలని 36 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించింది. ముసాయిదా జాబితాలో పారపాటున చేర్చిన తమ పేర్లను తొలగించాలంటూ 2.17 లక్షల మంది వ్యక్తులు ఇప్పటి వరకు దరఖాస్తులను అందజేశారని ఈసీ అధికారులు తెలిపారు. బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ముసాయిదాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత కూడా అవకాశమిస్తున్నట్లు ఈసీ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.