ఫల్టన్: మహారాష్ట్రలోని ఫల్టన్‌కు చెందిన మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యకు ముందుకు ఆమె రాసిన లేఖ అందరినీ కదిలింపజేస్తోంది. తనపై ఎస్సై గోపాల్ బాద్నే నాలుగుసార్లు అత్యాచారం చేశాడని మృతురాలు లేఖలో పేర్కొంది.
నాలుగు పేజీల సూసైడ్ లేఖలో..
మహారాష్ట్రలో చోటుచేసుకున్న యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చనిపోయేముందు ఆమె తన అరచేతిపై సూసైడ్ లేఖ రాసుకున్నారు. అలాగే అంతకుముందు రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ బయటపడటంతో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆ లేఖలో ఆమె తనపై ఎస్‌ఐ గోపాల్ బాద్నే ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు.
ఎంపీతోపాటు అతని పీఏల ప్రమేయం?
అలాగే ఆ లేఖలో ఆమె ఓ ఎంపీతోపాటు అతని పీఏలపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వారు తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. పోలీసు కేసుల్లోని పలువురు నిందితులకు నకిలీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులతో పాటు ఒక ఎంపీ, అతని సహాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని వైద్యురాలు ఆరోపించారు. అందుకే తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వైద్యురాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బాద్నే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. 5 నెలలకు పైగా శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆ లేఖలో వివరించారు. ఇక దీనిపై ఫల్టాన్ సబ్ డివిజనల్ ఆఫీస్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
పోలీసు అధికారి సస్పెండ్
బాధిత వైద్యురాలు గత 23 నెలలుగా ఇదే ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలని ఆమె భావించారు. అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కాగా వైద్యురాలు ఆ లేఖలో తన ఇంటి యజమాని ప్రశాంత్ బంకర్‌పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. ఎస్సై గోపాల్ బాద్నే, ఇంటి యజమాని బంకర్‌పై కేసు నమోదు చేశారు. ఎస్సై గోపాల్ బాద్నేను సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కొల్హాపూర్ డివిజన్) సునీల్ ఫులారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
పోలీసులను కాపాడుతున్న ‘మహాయతి’: కాంగ్రెస్
ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతలంతా పోలీసులను కాపాడుతున్నారని ఆరోపించింది.‘రక్షకుడే వేటగానిగా మారినప్పుడు.. న్యాయం ఎలా జరుగుతుంది? బాధిత వైద్యురాలు గతంలో ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహాయుతి ప్రభుత్వం పోలీసులను కాపాడుతోంది. ఫలితంగా పోలీసుల దురాగతాలు పెరుగుతున్నాయి’ అంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.
‘క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం’
‘ఈ సంఘటన దురదృష్టకరం, నేను సతారా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాను. వైద్యురాలు ఫిర్యాదు చేశారని, అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని మా దృష్టికి వచ్చింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. మహిళలు ఇటువంటి ఫిర్యాదులను నమోదు చేయడానికి 112 హెల్ప్‌లైన్‌ను ఉపయోగించాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బీజేపీ మహిళా నేత చిత్ర వాఘ్ పేర్కొన్నారు.


