న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లారుతూనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని జైపూర్ నుండి 25 మంది ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సు.. ఢిల్లీలోని జెండే వాలన్ ఆలయానికి సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రెస్క్యూ బృందాలు అతికష్టం మీద బయటకు తీసుకువచ్చాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సర్ గంగా రామ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్)ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితమే ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్ ? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?


