
బిల్లుల ఆమోదానికి గవర్నర్లు, రాష్ట్రపతికి గడువెలా వి«ధిస్తారు?
సుప్రీంకోర్టుకు 14 సూటిప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
గవర్నర్ ఆమోదించకున్నా బిల్లును చట్టంగా అమలు చేయొచ్చా?
గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారాలతో సుప్రీంకోర్టు పక్కన పడేయొచ్చా?
బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్‌కు ఉన్న ఆప్షన్లు ఎన్ని?
రాష్ట్రపతి వెలువర్చిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయి?
బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు, సలహాల కోసం కచ్చితంగా సంప్రదించాలా?
చట్టంగా మారబోతున్న బిల్లుల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా?
రాజ్యాంగంలో కాలావధి ప్రస్తావన లేనప్పుడు మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు?
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు
రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ, గవర్నర్‌గానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలను కుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా న్యాయసమీక్ష అధికారం మాకు ఉంది.
సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్న
బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటి? గవర్నర్లు, రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా కాలపరిమితిని విధిస్తారు? ఆర్టీకల్ 200, 201ను ఈ తరహాలోనే వినియోగించాలని గవర్నర్లు, రాష్ట్రపతికి మీరెలా దిశానిర్దేశం చేయగలరు?
న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్ర పతి వద్ద ఆమోదముద్ర కోసం నెలల తరబడి వేచిచూస్తున్న వైనంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన సంచలనాత్మక తీర్పు, ఆ తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించిన వైనంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసాధారణ రీతిలో స్పందించారు. బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటని సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.
సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన అత్యంత కీలకమైన తీర్పుపై ఇలా రాష్ట్రపతి తీవ్ర, విస్తృతస్థాయిలో స్పందించడం, నేరుగా సుప్రీంకోర్టునే స్పందన కోరడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు వెలువర్చిన తీర్పులపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రశ్నలు సంధించడం కూడా ఇదే తొలిసారి అని న్యాయరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రాష్ట్ర అసెంబ్లీలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం కోసం గవర్నర్ రిజర్వ్‌లో ఉంచిన నేపథ్యంలో అలాంటి బిల్లులపై మూడు నెలల్లోగా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని తెలపాల్సిందేనని ఏప్రిల్ 8వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువర్చడం తెల్సిందే.
దీంతో బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించవచ్చా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి తాజాగా సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి మొత్తంగా 14 సూటి ప్రశ్నలు వేశారు.
గత నెలలో ఇచ్చిన తీర్పులో ఏముంది?
తమిళనాడు శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ గవర్నర్‌గానీ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలంటూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై ఎటూ తేల్చకపోతే తమను మళ్లీ ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టంచేసింది. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా ఈ న్యాయసమీక్ష అధికారం తమకు ఉందని కోర్టు వెల్లడించింది.
ఆ 14 ప్రశ్నలు క్లుప్తంగా..
⇒ ఆర్టీకల్ 200 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు?
⇒ బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు, సూచనలకు గవర్నర్ ఏమేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది?
⇒ స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు?
⇒ ఆర్టీకల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయసమీక్ష జరుపుతుందా?. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాల్ చేయగలదు?
⇒ గవర్నర్ ఇంతకాలంలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా మీరెలా గవర్నర్‌ను ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం చెప్పాలని ఆదేశించగలరు?. ఆర్టికల్ 200ను ఈ తరహాలోనే వినియోగించాలని మీరెలా దిశానిర్దేశం చేయగలరు?
⇒ ఆర్టికల్ 201 ప్రకారం తనకు దఖలుపడిన విచక్షణాధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువర్చిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయి?
⇒ రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చా లని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు? ఆర్టికల్ 201ను ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు?
⇒ రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు, సలహాల కోసం సంప్రదించాలా?. ఒకవేళ సంప్రదించినా కోర్టు ఇచ్చే ఆ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా?
⇒ బిల్లులకు సంబంధించి గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారేలోపే ఆ నిర్ణయాలను కోర్టు న్యాయసమీక్ష జరపవచ్చా?. చట్టంగా మారబోతున్న బిల్లు ల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా?
⇒ ఆర్టికల్ 142 ద్వారా తమకు దఖలుపడిన అసాధారణ అధి కారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్లు/ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు/ఉత్తర్వులు అమలుకాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు/తీర్పులు వెలువర్చవచ్చా?
⇒ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్ ఆమోదించని/ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలుచేయొచ్చా?
⇒ ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా? లేదా? అని తేల్చి కనీసం ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలనే నిబంధనను సుప్రీం కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదుకదా?
⇒ ఆర్టీకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలుపడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి? వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా? లేదంటే పరిపాలన, చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలేతర అంశాలకూ విస్తరించాయా?
⇒ సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద కాకుండా మరే ఇతర అధికరణం కింద రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా?