మహారాష్ట్రలో మరో ఘోరం..

14 COVID-19 Patients Killed In Fire At Vijay Vallabh Hospital In Maharashtra - Sakshi

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

14 మంది కరోనా రోగులు సజీవ దహనం

సాక్షి ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.  పాల్ఘర్‌ జిల్లా విరార్‌లోని విజయ్‌ వల్లబ్‌ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు  బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 90 మంది రోగులున్నారు.
నాసిక్‌లోని జాకీర్‌ హుస్సేన్‌ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్‌ లీకేజీ కారణంగా ప్రాణవాయువు అందక 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.   అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.  

ఢిల్లీ  ఆసుపత్రిలో 25 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత సర్‌ గంగారాం హాస్పిటల్‌లో సరిపడా ప్రాణవాయువు లేక 24 గంటల్లో 25 మంది కరోనా బాధితులు చనిపోయారు. తక్కువ పీడనంతో ఆక్సిజన్‌ సరఫరా కావడమే ఈ మరణాలకు కారణమని అధికారులు తెలిపారు. వారికి అవసరమైన ఆక్సిజన్‌ అందక చనిపోయినట్లు భావిస్తున్నారు. మరో 60 మంది బాధితుల పరిస్థితి ఆదోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో  500 మందికిపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 150 మంది హై ఫ్లో ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఉన్నారు. వీరికి అధిక పీడనంతో ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది. అయితే, గంగారాం ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్‌ నిల్వ లున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top