10 ఏళ్ల బాలిక కిడ్నాప్‌, హత్య.. సీఎం విజయ్ ఏం చేశారంటే..? | 10-year-old girl killed, Tamil Nadu chief minister Vijay reacted | Sakshi
Sakshi News home page

10 ఏళ్ల బాలిక కిడ్నాప్‌, హత్య.. సీఎం విజయ్ ఏం చేశారంటే..?

May 23 2026 3:39 PM | Updated on May 23 2026 4:14 PM

10-year-old girl killed, Tamil Nadu chief minister Vijay reacted

చెన్నై: కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల చిన్నారి కిడ్నాప్‌ విషాదంగా ముగిసింది. తాజాగా తీవ్ర గాయాలతో కూడిన ఆ బాలిక మృతదేహం సూలురులోని కన్నంపాల్యం లేక్‌ వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ స్పందించారు. ఇటువంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరాదని ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 21వ తేదీ గత గురువారం రోజు సాయంత్రం సూలూరులో ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మోహాన్‌ రాజ్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను అపహరించారు. అనంతరం ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తాము మార్పు కోసం సీఎం విజయ్‌కు ఓటేశామని ఇప్పుడు ఈ ఘటనపై ఆయన కనీసం స్పందించడం లేదని ముఖ్యమంత్రి స్పందించేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.

దీంతో ఈ నిరసనల నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం విజయ్ స్పందించారు."నిన్న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికకు జరిగిన దారుణ ఘటన తీవ్ర దుఃఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి అమానుషమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని" అని Xలో పోస్ట్ చేశారు.

అయితే ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ సీరీయస్‌గా ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితురాలి తల్లిదండ్రులను ఆ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే సుకుమార్ కలిశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు.  

అయితే ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే, లైంగిక హింస, గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం, అధికార పార్టీ సభ్యుల దురుసు ప్రవర్తన, అరాచకాలు విపరీతంగా పెరిగి పోయాయాని ఇప్పుడు ఏకంగా  బాలిక అపహరణ, అనంతరం హత్య జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని తెలియజేస్తుందన్నారు. కేవలం 12 రోజుల్లోనే  30కి పైగా ప్రధాన ఘటనలు వార్తల్లోకి వచ్చాయని రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement