మత్తుతో భవిష్యత్‌ అంధకారం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

మత్తుతో భవిష్యత్‌ అంధకారం : ఎస్పీ

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

నారాయణపేట: విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని ఎస్పీ డా. వినీత్‌ కోరారు. ’ప్రహరి–యువ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్తంగా జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసం, ఉజ్వల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములై తోటి వారికి సైతం అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాధికారి డా. ఎం.గోవిందరాజు మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రహరీక్లబ్‌ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. 28వ తేదీన అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ఇంటర్మీడియట్‌ కళాశాలల ఉపాధ్యాయులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక అంశంపై శిక్షణ ఇవ్వాలని కోరారు. 30న అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు. వ్యక్తితో పాటు కుటుంబం, సమాజంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ, డీఈఓ చేతుల మీదుగా ’డ్రగ్స్‌ఫ్రీ క్యాంపస్‌ – స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఇయర్‌ క్యాలెండర్‌’ను ఆవిష్కరించారు. ఏడాది పొడవునా పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ క్యాలెండర్‌ దోహదపడుతుందని తెలిపారు.

రాజ్యాంగ పీఠిక పఠనం..

అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, శిక్షణ డీఎస్పీలు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎంఓ విద్యాసాగర్‌, సీఏంఓ రాజేంద్రకుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌, నషా ముక్త్‌ భారత్‌ విద్యాశాఖ నోడల్‌ అధికారి ఆర్‌.ఆంజనేయులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement