నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్‌న్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి భూ సేకరణ పురోగతిపై తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భూ సేకరణకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారితో చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. అవార్డులు, పరిహారం చెల్లింపులు, సర్వేనంబర్లకు సంబంధించిన వివాదాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. రైతులతో సమన్వయం చేసుకుంటూ భూ సేకరణ ప్రతిపాదనలు, భూ సర్వే, పరిహారం చెల్లింపుల్లో ఉన్న అడ్డంకులను తొలగించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకానికి అవసరమైన ప్రభుత్వ భూములు, ఆక్రమణలు లేని భూములు, వాటి స్థితిగతులు, సర్వే వివరాలు తదితర సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భూ సేకరణకు అనువైన భూములను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించే అవకాశం ఉన్నందున భూ రికార్డులు, వివరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రేడియల్ రోడ్డు భూ సేకరణను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని.. క్షేత్రస్థాయిలో సర్వే బృందాలను అందుబాటులో ఉంచి పనులకు ఆటంకం కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని సూచించారు. వచ్చే వారం మరోసారి సమీక్ష నిర్వహిస్తామని.. అప్పటిలోగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ రమేష్, ఏఓ అనిల్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ వేణుగోపాల్‌రెడ్డి, నారాయణపేట, ఉట్కూర్, దామరగిద్ద, మద్దూరు, గుండుమాల్, కోస్గి మండలాల తహసీల్దార్లు అమరేంద్రకృష్ణ, అశోక్‌కుమార్, తిరుపతయ్య, మహేష్, భాస్కరస్వామి, కళ్యాణి, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


