నీటి సరఫరా నిలిపివేశాం..
విచారణ చేపడతాం..
ప్రైవేట్ పనులకు పంచాయతీ వాహనం.. సీసీ రహదారులకు నీటి విక్రయం
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న ట్రాక్టర్ కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామపంచాయతీకి చెందినది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలో చెత్త సేకరణ, ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉంది. కాగా.. ఈ ట్రాక్టర్‌ను నిబంధలకు విరుద్ధంగా గ్రామంలో సీసీ రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ బస్తాలను తరలించేందుకు వినియోగిస్తూ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.’
కోస్గి: గ్రామాభివృద్ధికి తోడ్పడాల్సిన సర్పంచ్ గ్రామానికి సరఫరా చేసే తాగునీటి ట్యాంకు నుంచి సీసీ రహదారుల క్యూరింగ్‌కు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు నీటిని విక్రయిస్తూ యథేచ్ఛగా డబ్బులు దండుకుంటున్నారు. అలాగే పంచాయతీ ట్రాక్టర్‌ను సిమెంట్ బస్తాలను తరలించేందుకు వినియోగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోస్గి మండలం మీర్జాపూర్లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నర్సింహులు భార్య అర్చన ఈసారి ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందారు. దీంతో అటు ఫీల్డ్ అసిస్టెంట్‌గా, ఇటు అనధికార సర్పంచ్‌గా రెండుపాత్రలు పోషిస్తూ ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మీర్జాపూర్ నుంచి పీసీతండా వరకు చేపట్టిన సీసీ రహదారి పనులకు గ్రామపంచాయతీ ట్యాంకు నుంచి పట్టపగలే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో కొందరు యువకులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త నర్సింహులు అక్కడికి చేరుకోగా తాగేందుకు సరఫరా చేయాల్సిన నీటిని సీసీ రహదారులకు ఎలా అమ్ముకుంటావని అతడితో యువకులు వాగ్వాదానికి దిగారు. ఎవరికై నా చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ యువకులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. సీసీ రోడ్డు క్యూరింగ్ కోసం ట్యాంకర్‌కు రూ.వెయ్యి చొప్పున నీటిని విక్రయిస్తున్నారని.. నర్సరీ లేకపోయినా నర్సరీలో పనులు చేస్తున్నట్లు మస్టర్లో తనకు అనుకూలమైన కొందరు వ్యక్తుల పేరుతో బిల్లులు తయారు చేశారని, పంచాయతీ ట్రాక్టర్‌ను ప్రైవేట్ పనుల కోసం వినియోగిస్తున్నారని, పంచాయతీ నిధుల విషయంలో సైతం పలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా విషయాలను పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మీర్జాపూర్ పంచాయతీ నిధుల దుర్వినియోగం, నిబంధల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామపంచాయతీ వాటర్‌ట్యాంక్ నుంచి సీసీ రోడ్డు క్యూరింగ్‌కు నీటిని తరలించిన విషయం వాస్తవమే. తెలియగానే నీటి సరఫరా ట్యాంకర్‌ను ఆపి వేయించా. పంచాయతీ ట్రాక్టర్ ప్రైవేట్‌గా వినియోగం, ఇతర విషయాలపై విచారణ జరిపి అధికారులకు నివేదిక అందజేస్తాం.
– బసప్ప, పంచాయతీ కార్యదర్శి
మీర్జాపూర్లో చోటు చేసుకున్న ఘటనలపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించాం. సమగ్ర విచారణ అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్, ఎంపీడీఓ, కోస్గి


