పారదర్శకంగా చేపడుతాం..
● పీయూలో రెగ్యులర్
అధ్యాపక పోస్టులకు మోక్షం
● సుమారు పదేళ్ల తర్వాత
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
● జీఓ 21ని సవరించి
కొత్తగా జీఓ 31 జారీ చేసిన ప్రభుత్వం
● అనుభవం ఉన్న అధ్యాపకులకు వెయిటేజీ ఇవ్వనున్న అధికారులు
● త్వరలోనే మెజార్టీ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం
పీయూతోపాటు జోగుళాంబ గద్వాల, కొల్లా పూర్, నాగర్‌కర్నూల్ పీజీ సెంటర్లతోపాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన లా, ఇంజి నీరింగ్ విభాగాల్లో 19 డిపార్ట్మెంట్లు ఉండగా.. వీటిలో మొత్తం 152 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో ప్రస్తుతం 18 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తుండగా.. మిగతా 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్నే ళ్లుగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు తమను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వద్ద గురువారం రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమం సైతం చేపట్టనున్నారు.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అందులో పనిచేసే అధ్యాపకులే కీలకం. ఈ క్రమంలో అధ్యాపకుల భర్తీ ప్రక్రియ ప్రొఫెసర్ భాగ్యనారాయణ వీసీగా ఉన్న 2014– 15 సంవత్సరాల్లో జరగగా.. ప్రస్తుతం సుమారు పదేళ్ల తర్వాత రెగ్యులర్ అధ్యాపకుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యూనివర్సిటీ అధికారులు ఇటీవల ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మెజార్టీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఏ యూనివర్సిటికీ ఆ యూనివర్సిటీ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు అనుగుణంగా మరో ఐదారు నెలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనున్నట్లు సమాచారం.
80 శాతానికి పైగా మార్కులు..
డిగ్రీలో 80 శాతానికిపైగా మార్కు ఉంటే 15, 80 నుంచి 60 శాతం మధ్యలో ఉంటే 13, 55–60 శాతం ఉంటే 10 మార్కులు, పీజీలో 80 శాతంకన్నా ఎక్కువ ఉంటే 25, 60–80 మధ్యలో ఉంటే 23 మార్కులు, ఎంఫిల్‌లో 60 శాతం కన్నా పైగా ఉంటే 7 మార్కులు, పీహెచ్డీ ఉంటే 30 మార్కులు, నెట్‌తో జేఆర్ఎఫ్ ఉంటే 7, కేవలం నెట్ ఉంటే 5, స్లెట్, సెట్ ఉంటే 3, పబ్లికేషన్స్ 10 టీచింగ్‌లో ప్రతి సంవత్సరానికి 2 మార్కులు, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్‌కు 3, స్టేట్ లెవల్ అవార్డ్స్‌కు 2.. ఇలా అకాడమిక్స్‌లో 80, రీసెర్చి పబ్లికేషన్స్‌లో 10, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో 10 మార్కులు ఉండగా.. డెమోకు 10, పబ్లికేషన్స్‌కు 3 మొత్తం 100 మార్కులు కేటాయించనున్నారు. అయితే టెక్నికల్, ఇంజినీరింగ్ విభాగంలో మాత్రం మార్పులు చోటు చేసుకోనున్నాయి. డెమోతోపాటు పలు అంశాల్లో మార్కులు వేయనున్నారు.
రోస్టర్ ఆధారంగా ఎంపిక..
అధ్యాపకుల నియామక ప్రక్రియ పూర్తిగా కమిటీల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇందులో పీయూ వైస్ చాన్స్‌లర్ నామినీగా ఉండడంతోపాటు ఒక సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉండనుండగా వారిని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నియమించనుంది. బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. దరఖాస్తుల పరిశీలనలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నల్ కమిటీలు కూడా ఉంటాయి. మొత్తం రోస్టర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పీయూలో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం విధివిధానాలను ప్రభుత్వం జీఓ 31ని విడుదల చేసింది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టులలో ఎన్ని భర్తీ చేయాలనే దానిపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం రోస్టర్ చేసిన తర్వాత నోటిఫికేషన్‌ను విడుదల చేసి భర్తీ ప్రక్రియ చేపడతాం. ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. అధ్యాపక పోస్టుల భర్తీ వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ఇదే సమయంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం జరిగేలా చూస్తాం.
– జీఎన్ శ్రీనివాస్, వీసీ, పీయూ


