మరికల్: ప్రకృతి వైఫరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో 2018–19 అనంతరం నిలిపివేశారు. ప్రస్తుతం ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యాసంగి నుంచి ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని సూత్రప్రాయంగా ప్రకటించింది. తద్వారా జిల్లాలోని 4.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. యాసంగిలో ఆకాల వర్షాలు కురిస్తే వరితో పాటు ఇతర పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు లేకపోతే వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో ఏటా పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానతో అధిక నష్టం జరుగుతోంది. ఫసల్ బీమా యోజన అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలుపడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గతంలో అమలు తీరు ఇలా..
గతంలో పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసేవారు. వరికి గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, సోయా, వేరుశనగ పంటలకు మండలం యూనిట్‌గా బీమా వర్తింపజేశారు. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వానాకాలంలో పత్తి ఉంటుంది. వానాకాలం, యాసంగి సీజన్‌లో ఆకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతుంటారు. అలాంటి వారికి ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. అన్నదాతలు పంట రుణం తీసుకునే సమయంలోనే బ్యాంకర్లు పంట రకాన్ని బట్టి వానాకాలం సీజన్‌కు 2 నుంచి 5 శాతం, యాసంగిలో 105 నుంచి 5 శాతం ప్రీమియాన్ని తప్పనిసరిగా కంపెనీకి చెల్లించేవారు. రైతులు చెల్లించిన డబ్బులకు సమానమైన డబ్బులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీకి చెల్లించేవి. అప్పట్లో పంట నష్టపోతే వరి ఎకరాకు రూ. 37,484 పత్తికి రూ.36,282, మొక్కజొన్నకు రూ.18,742 పరిహారం ఇచ్చారు. సుమారు ఏడేళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపివేయడంతో జిల్లా రైతులు ఎక్కువ సంఖ్యలో ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో జిల్లా రైతులకు ధీమా కలుగుతోంది.
రాష్ట్రంలో నిలిపివేసిన గత ప్రభుత్వం
వచ్చే యాసంగి నుంచి అమలుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు
మళ్లీ చిగురిస్తున్న ఆశలు
జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు
2022–23 యాసంగిలో వడగళ్ల వానతో జిల్లావ్యాప్తంగా సుమారు 23 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం చెల్లించేందుకు సర్వేను పూర్తి చేయించి ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది. అనంతరం అధికారం మారడంతో తమకేం సంబంధం లేదని ప్రస్తుత సర్కార్ చేతులు దులుపుకొంది. ఏదేమైనా రైతులు మాత్రం నష్టపోయారు.గతంలోనూ ఫసల బీమా అమ లై ఉంటే వారికి పరిహారం అంది ఉండేది.


