ఓటర్ల జాబితా సవరణకు భారీ స్పందన
13 నియోజకవర్గాల్లో..
● ముగిసిన ‘సర్’ అభ్యంతరాలు,
ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ
● పరిశీలనలో నిమగ్నమైన
అధికార యంత్రాంగం
● ఉమ్మడి జిల్లాలో 19,307
కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు
● విదేశీ ఓటర్ల నమోదుకు స్పందన కరువు
అచ్చంపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు అందాయి. జూన్ 15 నుంచి అక్టోబరు 7 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు ద్రువీకరణ పత్రాలు సమర్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లు నిండి, ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఫారం–6 ద్వారా 19,307 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 1,874 మంది అర్హులుగా నిర్ధారించారు. ఫారం–6ఏ ప్రవాస భారతీయ ఓటర్లుగా 33 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ముగ్గురిని అర్హులుగా తేల్చారు. ఇక ముసాయిదా జాబితాలో ఓటర్ల తొలగింపునకు 1,478 దరఖాస్తులు ఫారం–7 ద్వారా వచ్చాయి. ఇందులో 656 మంది ఓటర్లు అనర్హులుగా తేల్చి తొలగించారు. కొత్తగా నమోదు కానున్న ఓటర్లను సైతం పరిగణలోకి తీసుకుంటే నవంబరు 9న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితా కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల వివరాల్లో మార్పులు/ తప్పులు, దిద్దబాటు/ చిరునామా మార్పు కోసం ఫారం–8 ద్వారా 29,048 దరఖాస్తులు రాగా.. 1,2147 దరఖాస్తులు మార్పులు చేర్పులు చేశారు. ఓటరు వివరాల్లో మార్పులు, సవరణ, చిరునామా, ఎపిక్ మార్పిడికి దరఖాస్తులు ఎక్కువగా సమర్పించారు. ఈ దరఖాస్తులను నవంబర్ 5లోగా పరిష్కరించి ఆ మేరకు తుది ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఈసీ చర్యలు తీసుకోనుంది. వీటిని స్థానిక ఈఆర్వోలు/ ఏఈఆర్వోలు పరిశీలించి పరిష్కరిస్తారు.
విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయ పౌరుల నమోదుకు సంబంధించిన ఫారం–6ఏకు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో స్పందన అంతగా కనిపించలేదు. 13 నియోజకవర్గాల్లో కలిసి 33 దరఖాస్తులు రాగా వాటిలో మూడింటికి పరిష్కారం లభించింది. అలాగే ఓటర్ల వివరాల్లో తప్పులను సరిదిద్దడానికి, చిరునామా మార్పు, పేర్లలో దొర్లిన తప్పులకు సంబంధించి ఫారం–8 ద్వారా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. పాలమూరులో 5,428 దరఖాస్తులు రాగా 1,869 దరఖాస్తులు సవరించారు. అచ్చంపేటలో 3,050, కొడంగల్‌లో 2,776, దేవరకద్రలో 2,439, నారాయణపేటలో 2,080 దరఖాస్తులు వచ్చాయి.


