● పాలమూరులో నాటి బొడ్డెమ్మ.. నేటి బతుకమ్మ
● వెయ్యేళ్ల చరిత్ర.. తరతరాల సాంస్కృతిక వారసత్వం
● కుప్పాంబిక కాలం నుంచే బొడ్డెమ్మ వేడుకలు
● వందమంది కవులతో ‘బతుకమ్మ మొగ్గలు’
● ‘సాక్షి’తో పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
స్టేషన్ మహబూబ్‌నగర్: పూలను పేర్చి బతుకును కొలిచే పండుగ.. ఆడబిడ్డల ఆటపాటల్లో ఆత్మీయతను పంచే వేడుక.. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని చాటే సాంస్కృతిక సంబురం బతుకమ్మ. తరతరాలుగా వస్తున్న ఈ పండుగకు పాలమూరుతో విడదీయలేని అనుబంధం ఉంది. నేటి బతుకమ్మ వేడుకల వెనుక నాటి బొడ్డెమ్మ సంప్రదాయం, సంస్థానాల కాలం నాటి చరిత్ర, సాహిత్య పరిమళాలు దాగి ఉన్నాయని పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ వివరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, పాలమూరు సాహిత్యంలో దాని స్థానం గురించి ఆయన ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
నాటి బొడ్డెమ్మ.. నేటి బతుకమ్మ
బతుకమ్మ పేరు విస్తృతంగా ప్రచారంలోకి రాకముందు దక్షిణ తెలంగాణలో బొడ్డెమ్మ సంప్రదాయం ప్రాచుర్యంలో ఉండేది. ఆడబిడ్డలంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేసేవారు. కాలక్రమంలో ఈ సంప్రదాయం బతుకమ్మ వేడుకలతో మమేకమైందని చెప్పవచ్చు. ఈ పండుగకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాలమూరు ప్రాంతానికి చెందిన తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందిన కుప్పాంబిక 13వ శతాబ్దంలో తన రాజధాని బుద్ధపురం (నేటి భూత్పూర్)లో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. ఆ ఉత్సవాల్లో బొడ్డెమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉండేది. వేడుకల్లో పాల్గొన్న మహిళలకు చీరలు, బహుమతులు అందించి గౌరవించేవారు.
సంస్థానాల్లోనూ ఘనంగా..
పాలమూరు ప్రాంతంలోని సంస్థానాల కాలంలోనూ దసరా ఉత్సవాలు అట్టహాసంగా జరిగేవి. జటప్రోలు, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, అలంపూర్, గోపాలపేట తదితర సంస్థానాల్లో మహిళలు బొడ్డెమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేవారు. తెలంగాణలోని పలు సంస్థానాల్లోనూ ఈ సంప్రదాయం కొనసాగినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వేడుకలు నేటి బతుకమ్మ పండుగలోనూ సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని చాటుతున్నాయి.
బతుకమ్మపై విస్తృత సాహిత్యం
పాలమూరు సాహిత్య ప్రపంచంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ ఇతివృత్తంగా పలువురు కవులు, రచయితలు పద్యాలు, కవితలు, గేయాలు, కథలు రచించారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు వేపూరు హనుమద్దాసు రామాయణ గాథను బతుకమ్మ పాట రూపంలో రచించడం విశేషం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటల రూపంలో ప్రజలకు చేరువ చేయడంలో ఇలాంటి రచనలు కీలక పాత్ర పోషించాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, పరిశోధకులు గుండోజు యాదగిరి ‘సమ్మక్క సారలమ్మ బతుకమ్మ పాట’ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. కల్వకుర్తికి చెందిన డా.ద్యాప విజితారెడ్డి ‘బతుకమ్మ పండుగ– పరిశీలన’ అంశంపై పరిశోధన చేశారు. వీరేకాక ఇంకా చాలామంది కవులు బతుకమ్మపై వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు.
తెలంగాణ అస్తిత్వానికి పతాక
రంగురంగుల పూలతో అలంకరించే బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు.. ఊరువాడలను ఒక్కటి చేసే సామూహిక సంబురం. మహిళల ఆటపాటలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత కలగలిసిన ఈ వేడుక తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. బతుకమ్మ పాటల్లో ప్రకృతి సౌందర్యం ప్రతిఫలిస్తుంది. ఈ పండుగ మహిళా జీవితాలకు ఆనందాన్ని పంచుతూ తెలంగాణ అస్తిత్వాన్ని తరతరాలకు చాటుతోంది.
వందమంది కవులతో ‘బతుకమ్మ మొగ్గలు’
బతుకమ్మ సాహిత్యాన్ని మరింత విస్తృతంగా పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తన సంపాదకత్వంలో వందమంది కవులు రచించిన కవితలతో ‘బతుకమ్మ మొగ్గలు’ పుస్తకాన్ని పాలమూరు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించాం. 2019లో వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో మరో కార్యక్రమంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. బతుకమ్మపై మరింత సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
బతుకమ్మ మొగ్గలు
రంగురంగుల పూలతో అందంగా అలంకరిస్తూనే
ఊరువాడంతటినీ ఏకం చేసే పండుగ
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ.
బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాల అంటూ
పాడుతూనే మహిళామణులంతా ఆడుతూ వీనుల విందు చేస్తారు. మహిళా జాతికి
మణిహారం బతుకమ్మ పండుగ.
ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని కీర్తిస్తూనే
తీరొక్క పూలతో బతుకమ్మను ఆరాధిస్తారు.
తెలంగాణ అస్తిత్వానికి అసలైన పతాక
బతుకమ్మ. – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


