నారాయణపేట: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల ఆత్మీయ సమ్మేళనం (బడాఖానా)లో కలెక్టర్‌తో పాటు ఎస్పీ డా. జి.వినీత్ దంపతులు, పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాపోటీలు, దాండియా, బతుకమ్మ పాటలు, నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించడంతో ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణలో పోలీసులు తమ వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేస్తుంటారని, వారికి కుటుంబ సభ్యులు అందించే సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కుటుంబసభ్యుల సహకారంతోనే..
పోలీసుల విధి నిర్వహణ వెనుక కుటుంబసభ్యుల త్యాగం, సహకారం, ప్రోత్సాహం ఉన్నాయని ఎస్పీ డా. జి.వినీత్ పేర్కొన్నారు. ఏడాది కాలంగా కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పోలీసు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావాన్ని కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


