దామరగిద్ద: విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం ముస్తాపేట, దేశాయపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల రైతులు మండలంలోని క్యాతన్‌పల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ మాట్లాడుతూ.. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సరిపడా నీరందక సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటిని నీటితో పంటలను కాపాడుకుందామన్నా.. సమయపాలన లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేపట్టి పంటలను కాపాడాలని లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఏఈ అనిల్‌కుమార్ ట్రాన్స్‌కో డీఈతో రైతులను మాట్లాడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రోషనప్ప, రైతులు చెన్నప్ప, బాలవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గోవిందరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.


