నారాయణపేట: హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో జిల్లా పోలీసులు సత్తా చాటారు. 50+తో పాటు ఓపెన్ కేటగిరీ సింగిల్స్‌లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్ రెండు బంగారు, 40+ విభాగంలో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. అలాగే ఎన్‌జీవోస్ కేటగిరీలో ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ బాలరాజు అద్భుత ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించారు. పతకాలు సాధించిన రియాజ్ ఉల్‌హక్, బాలరాజును సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. వినీత్ ప్రత్యేకంగా అభినందించారు. విధులతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వ స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. వచ్చే నెల బెంగళూరులో జరిగే నేషనల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి జిల్లా, తెలంగాణ పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కలెక్టరేట్ ముట్టడిని
విజయవంతం చేయాలి
నారాయణపేట: ఓటుహక్కు పరిరక్షణ, ఓటరు జాబితాలో అవకతవకలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఇండియా కూటమి పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్‌న్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రామారెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితాపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు సరైన అవకాశం కల్పించడంతో పాటు మరణించిన, డూప్లికేట్ నమోదును నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని.. పాత బస్టాండ్, సివిల్‌లైన్‌న్ మీదుగా కలెక్టరేట్ వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్ మిత్రపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజాస్వామ్యవాదులు అధికసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎండీ సలీం, శివారెడ్డి, బండి వేణుగోపాల్, సుధాకర్, సంతోష్‌కుమార్, వెంకటేష్‌గౌడ్, కోట్ల రవీందర్‌రెడ్డి, మహిమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్, బలరాం, కెంచి నారాయణ పాల్గొన్నారు.
బీఎడ్ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బీఎడ్ ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ సెమిస్టర్–2లో 80.45 శాతం, సెమిస్టర్–4లో 95.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు బ్యాక్‌లాగ్ 3వ సెమిస్టర్ 86.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంపై వీసీ సంతృప్తి వ్యక్తం చేసి.. ఫలితాలు మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, ఎంఈడీ ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


