మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్‌లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్‌బుక్‌ల నమోదు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.
పారదర్శకత పెంచేలా..
ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్‌మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది.
నమోదులో ఇబ్బందులు..
సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్‌లైన్‌లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు.
కార్యాలయంలోనే ప్రక్రియ..
ప్రభుత్వం సర్వీస్ బుక్‌ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్‌లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్‌లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్‌కు సంబంధించిన పాస్‌వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్‌మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్‌లను కాంప్లెక్స్ హెచ్‌ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్‌ను ఆన్‌లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి.
డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు
వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు
గత నెల 31 వరకే ముగిసిన గడువు
మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు


