తొలివాన తర్వాత విరామం..
సాగు పద్ధతులు మార్చుకోవాలి..
వర్షాలకు ఎల్‌నినో ముప్పు
● రుతు పవనాలు గతి తప్పే అవకాశం
● ఆగష్టు, సెప్టెంబర్ మధ్యలో తీవ్ర
వర్షాభావ పరిస్థితులు
● సాగు విధానంలో మార్పులు
అవసరమంటున్న
వ్యవసాయ అధికారులు
–8లో u
మరికల్: వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లాపై పడుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినోతో రుతు పవనాలు గతి తప్పే అవకాశం ఉండటంతో రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకుంటే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు.
జిల్లాలో వానాకాలం సాగు అంచనా.. జిల్లావ్యాప్తంగా 1.92 లక్షల మంది రైతులు ఉండగా.. 2026 వానాకాలంలో 4.34 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 1.90 లక్షల ఎకరాలు, పత్తి 1.80 లక్షలు, కంది 60 వేలు, ఆముదం 2 వేలు, పెసర వెయ్యి, పచ్చజొన్న వెయ్యి, ఉద్యా న పంటలు 300 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనాలు రూపొందించారు.
ఎల్‌నినో ప్రభావం..
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో ఎల్‌నినో ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఓ మోస్తరు, జూన్ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై ఇటీవల అవగాహన కల్పించింది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు బృందాలుగా పర్యటించారు. ఎల్‌నినో పరిస్థితులను వివరించి పంటల ప్రణాళికపై దిశా నిర్ధేశం చేశారు.
వానాకాలంలో తొలకరి జల్లులు కురవగానే విత్తనాలు వేయడం రైతులకు అలవాటు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పుడు తొలివాన అనంతరం పెద్ద విరామం రావొచ్చు. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిస్తేనే విత్తనం వేయాలి. లేదంటే మొలకలు ఎండిపోయి పెట్టుబడులు వృథా అవుతాయి. నీటి నిల్వలు తక్కువగా ఉండొచ్చు. ఈసారి వరి తదితరాల పంటల కంటే తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాగు పద్ధతులను మార్చుకుంటే ఎల్‌నినో వంటి సవా ళ్లు సైతం దిగుబడులను అడ్డుకోలేవు. ఈసారి రుతు పవనాలు క్రమం తప్పే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం తీసుకొచ్చి వర్షాభావ పరిస్థితులను వివరించాం. మూస ధోరణిలో కాకుండా వ్యవసాయ, వాతావరణ నిపుణుల సూచన మేరకు పంటలు సాగు చేస్తేనే రైతులు గట్టెక్కే అవకాశం ఉంది.
– జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి


