కల్యాణ.. వైభోగమే | - | Sakshi
Sakshi News home page

కల్యాణ.. వైభోగమే

Jun 1 2026 12:50 AM | Updated on Jun 1 2026 12:50 AM

మన్యంకొండలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గరుడగిరి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రోచ్ఛరణాలు, సన్నాయి వాయిద్యాల మధ్య అపూర్వ మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గరుడగిరి వరకు తీసుకెళ్లి పూజలు జరిపించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాలు అలంకరణలో స్వామి దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజ్‌, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

శేష వాహనంపై విహరించిన స్వామివారు..

మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శేషవాహన సేవను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement