మక్తల్: పట్టణంలో డీజిల్, పెట్రోల్ కొరత తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కర్ని రోడ్‌లో ఉన్న పెట్రోల్‌బంకు వద్ద వాహనదారులు డబ్బాలను వరుసలో ఉంచి వేచి ఉండటం కనిపించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌లో పెట్రోల్ రూ.150, డీజిల్ రూ.120 కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. కొందరు ఇదే అదనుగా భావించి కర్ణాటక నుంచి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.
మోదీ సందేశం.. దేశ నిర్మాణానికి మార్గదర్శకం
నారాయణపేట: అభివృద్ధి, బాధ్యత, దేశభక్తి, సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించడంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విశిష్ట పాత్ర పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ అన్నారు. ఆదివారం ఆయన తన ఇంట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. దేశ ప్రజలతో నేరుగా అనుసంధానించే వేదికగా గుర్తింపు పొందిన మన్ కీ బాత్ కార్యక్రమం మరోసారి ప్రజా చర్చకు కేంద్రబిందువైందని.. మోదీ సందేశాలు దేశ నిర్మాణానికి మార్గదర్శకం అవుతున్నాయని వివరించారు. రాజకీయ అంశాలకు దూరంగా ఉంటూ సమాజంలో స్ఫూర్తిదాయక మార్పులు తీసుకొచ్చిన సాధారణ వ్యక్తుల కథనాలను ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో సేవా భావాన్ని పెంపొందిస్తున్నారన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, యువ ఆవిష్కర్తలు, రైతులు, మహిళా సంఘాలకు ‘మన్ కీ బాత్’ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని చెప్పారు. స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఫిట్ ఇండియా, డిజిటల్ ఇండియా, మహిళా సాధికారత వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నారన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మోదీ ప్రసంగాలు ఉంటాయని, దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలన్నా రు. ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత కోసం అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కెంచె శ్రీనివాసులు, రామచంద్ర మిస్కిన్, గోపాల్, మిర్చి వెంకటయ్య, వెంకట్రాములు, ప్రభాకర్ కమలాపుర, బండారే సత్యకుమార్, శ్రీను, కిరణ్ పాల్గొన్నారు.


