బెల్టు దుకాణాలపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

బెల్టు దుకాణాలపై పోలీసుల దాడులు

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

ఎనిమిది నెలల్లో 155 కేసులు నమోదు

డయల్‌ యువర్‌ ఎస్పీలో సైతం ఫిర్యాదులు

విక్రయాలు పడిపోవడంతో ఎకై ్సజ్‌ అధికారులపై ఒత్తిళ్లు

నారాయణపేట: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతుండగా.. ఎకై ్సజ్‌శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్‌ దుకాణాలు, దాబాలు, గుట్టుగా నడుస్తున్న మద్యం అడ్డాలపై ఎస్పీ ఆదేశాలతో పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తూ ఎనిమిది నెలల్లో 155 కేసులు నమోదు చేయగా.. మద్యం అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్‌శాఖ మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారిక మద్యం విక్రయాలు పడిపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఎకై ్సజ్‌ అధికారులకు ఒత్తిళ్లు పెరిగినట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది.

తగ్గిన విక్రయాలు.. పెరిగిన ఒత్తిళ్లు...

జిల్లాలోని మద్యం దుకాణాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఎకై ్సజ్‌శాఖకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం విధించిన మద్యం విక్రయాల లక్ష్యం చేరకపోవడంతో జిల్లాస్థాయి అధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి మద్యం విక్రయాలే ప్రధాన ఆదాయ వనరుగా ఎకై ్సజ్‌ అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది నెలల్లో సుమారు రూ.8 కోట్ల ఆదాయం పడిపోవడంతో ఉన్నతాధికారుల నుంచి అక్షింతలు పడినట్లు తెలుస్తోంది.

8 నెలలు.. 155 కేసులు...

ఎస్పీ డా. వినీత్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2026, మే వరకు జిల్లావ్యాప్తంగా 155 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. పోలీసుల దాడుల్లో భారీగా మద్యం బాటిళ్లు, అక్రమ నిల్వలు పట్టుబడుతున్నప్పటికీ.. మరుసటి రోజే అదే ప్రాంతాల్లో మళ్లీ విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా బెల్ట్‌ షాపులుఉన్నయానేది ఇటు పోలీస్‌, అటు ఎకై ్సజ్‌ అధికారుల లెక్కల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎస్పీ స్పెషల్‌ ఫోకస్‌..

జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా రాత్రిళ్లు ఆకస్మిక తనిఖీలు, దాబాలపై దాడులతో అక్రమ వ్యాపారులకు పోలీస్‌శాఖ చెక్‌ పెడుతూ వచ్చింది. మద్యం విక్రయాలు తగ్గుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. కాగా నెల రోజుల నుంచి దాబాలు, బెల్ట్‌ షాపులపై ఫిర్యాదులు అందినా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దాబాల్లో మద్యం విక్రయాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

దాబాలే అడ్డాలు..

జిల్లాలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ఉన్న సుమారు 60 దాబాలు ఇప్పుడు మందుబాబుల అడ్డాలుగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో దాబాల్లో దర్జాగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు నిర్వాహకులు ప్రత్యేక గదులు ఏర్పాట్లు చేసి మినీ బార్లను తలపించేలా వ్యాపారం సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎంఆర్‌పీలకు అదనంగా డబ్బులు తీసుకొని మద్యం విక్రయాలు సాగిస్తూ భారీగా ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో కొన్ని దాబాల్లో భారీగా మద్యం నిల్వలు బయటపడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మరుసటి రోజే మళ్లీ అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్‌శాఖ మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో సైతం బెల్టు దుకాణాలపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement