● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట రూరల్: సంపూర్ణ అక్షరాస్యతతోనే వలసల నివారణ సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని.. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన భోజనంతో పాటు ఈ ఏడాది నుంచి అల్పాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ స్కూల్ రంగులను చూసి మోసపోకుండా గ్రామంలోని సర్కార్ బడికి తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడంతో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం లభిస్తాయని తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన కోరికల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరిక మేరకు ఉద్యోగుల సౌకర్యార్థం జిల్లాకేంద్రంలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామీణస్థాయిలో కార్పొరేట్ విద్య..
గ్రామీణస్థాయి విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. విద్యాశాఖను స్వయంగా సీఎం పర్యవేక్షిస్తుండటంతో తక్కువ కాలంలోనే విద్యారంగం మరింత అభివృద్ధి చెందిందని.. రాబోవు రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా, టీఎస్ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లాడుతూ.. విద్యారంగంలో ఏ ఫలితాలు చూసిన అమ్మాయిలే ముందు వరుసలో ఉంటున్నారని, ఇదే పరంపర ఉద్యోగ, ఉపాధిరంగాల్లో కొనసాగిస్తే తక్కువ కాలంలోనే వందశాతం మహిళా సాధికారికత సాధించడం ఖాయమని అన్నారు. రాబోవు రెండేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చూడబోతున్నామని.. ఇప్పటికే ఉన్నత విద్యలో కొత్త కోర్సులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. రాబోవు విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేద్దామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అవార్డులతో పాటు ప్రధానోపాధ్యాయులను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.జనార్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, తిరుపతి, వి.సంతోష్ కుమార్, డీఈఓ గోవిందరాజు, డీఐఈఓ సుదర్శన్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎండీ రషీద్, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


