నారాయణపేట: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా వారోత్సవాల సందర్భంగా ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ పేరిట స్వయం సహాయక సంఘాలకు రుణమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జిల్లాలోని 174 యూనిట్లకు రూ.7.24 కోట్లకు పైగా రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో కిస్తులు చెల్లిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తాము ఎంచుకున్న వ్యాపారాల్లో లాభాలు ఆర్జించి ఆదర్శంగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి జిల్లా అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, మహిళలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఇంట్లో ఉన్న ఆడ పిల్లలను బాగా చదివించాలని, పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోయిందనే భావనను తల్లిదండ్రులు విడాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్, వాటి నివారణలో స్వయం సహాయక సంఘాల సభ్యుల పాత్ర కీలకమని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాల్య వివాహ నిరోధక చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కిశోర బాలికలకు అండగా నిలిచి, మహిళా సంఘాల్లో చేర్పించి ఆర్థిక స్వాతంత్య్రం సాధించేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, సెర్ప్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు..
అకాల వర్షాలకు తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక శుక్రవారం తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షానికి తడిసిన వరి ధాన్యం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దామరగిద్ద మండలం గత్పలో లారీలు అందుబాటులో లేక పొలాల్లోనే వరి ధాన్యం ఉందని.. కేంద్రాలకు తరలించి కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో శుక్రవారం వరకు 17,986 మంది రైతుల నుంచి 1,35,511.980 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం విలువ సుమారు రూ.323.73 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 16,201 మంది రైతుల ఖాతాల్లో రూ.273.54 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఇది మొత్తం చెల్లింపుల్లో 84.50 శాతమని పేర్కొన్నారు. అకాల వర్షాలకు దామరగిద్ద మండలంలోని విఠలాపూర్, అన్నాసాగర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసినట్లు తెలిపారు. వాటిని వెంటనే రైస్‌మిల్లులకు తరలించి నష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 98 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందని, మిగిలిన ధాన్యాన్ని మరో రెండు రోజుల్లో కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


