నారాయణపేట: డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అదేస్థాయిలో సైబర్ నేరగాళ్ల మోసాలు విస్తరిస్తున్నాయని, క్షణాల్లో ఖాతాల్లోని డబ్బులు మాయం చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఎస్పీ డా. వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆనన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, సోషల్ మీడియా, ఫేక్ లింకులు, నకిలీ యాప్‌లు, కస్టమర్‌కేర్ కాల్స్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసు సిబ్బంది, కస్టమర్‌కేర్ ప్రతినిధుల పేరుతో ఫోన్‌చేసి ఓటీపీలు, ఏటీఎం పిన్‌నంబర్, ఖాతా వివరాలు అడిగి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తెలియని మెస్సేజ్‌లు, వాట్సాప్ లింకులు, ఈ–మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా పోలీస్‌శాఖ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన ఆయుధమని ఎస్పీ సూచించారు.
ఎస్పీని కలిసిన మక్తల్ ఎస్‌ఐ..
దామరగిద్ద ఎస్సైగా పనిచేసిన పి.రాజు మక్తల్ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు మక్తల్ ఎస్సైగా పనిచేసిన భాగ్యలక్ష్మిరెడ్డి ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కాగా పి.రాజు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వినీత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మక్తల్ వంటి కీలక ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టం అమలులో రాజీ పడకుండా పని చేయాలని సూచించారు.


