నారాయణపేట: బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసి బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసిరావాలని, బాలికల విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం, స్నేహ సంఘాల సహకారంతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ డా. వినీత్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో బాలికల్లో చైతన్యం పెంపొందిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. బాలికల విద్యాభివృద్ధే బాల్య వివాహాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన వారు ముగ్గురు బాలికలే కావడం గర్వకారణమన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చే బాలికలు ఉద్యోగ అవకాశాల దశకు వచ్చే సరికి వెనుకబడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదోతరగతి తర్వాత ఆరేళ్లు బాలికల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక సమయమని.. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మలుస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాలికల చదువుకు ప్రాధాన్యతనిస్తూ వారి కలలకు అండగా నిలవాలని కోరారు. వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యులైన మహిళలకు విద్యనందిస్తున్న వీఓలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలికల విద్య, అక్షరాస్యత, చట్టాలపై అవగాహన పెంపు, కిశోర బాలికల సంఘాల బలోపేతం వంటి చర్యలు భవిష్యత్‌లో బాల్య వివాహాల నియంత్రణకు బలమైన పునాదిగా నిలవనున్నాయన్నారు. జిల్లాలో మహిళా అక్షరాస్యత శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు.
మిషన్ మోడ్‌లో పనిచేద్దాం..
బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ డా. వినీత్ సూచించారు. మహిళల విద్యతోనే కుటుంబాలు, సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిరోధక చట్టంపై కిశోర బాలికలు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. చట్టంపై బాలికలు ప్రదర్శించిన అవగాహనను కలెక్టర్, ఎస్పీ ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సీసీలు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డీఈఓ గోవిందరాజు, డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


